‘Maremma’ Release Date: మాస్ మహారాజా రవితేజ కుటుంబం నుంచి మరో కొత్త కథానాయకుడు టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. రవితేజ సోదరుడి కుమారుడు మాధవ్ కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం మారెమ్మ. గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదల కానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

ఆకట్టుకుంటుంది రిలీజ్ పోస్టర్

సినిమా విడుదల తేదీని వెల్లడిస్తూ నిర్మాణ సంస్థ మోక్ష ఆర్ట్స్ సోషల్ మీడియాలో ఒక విలక్షణమైన పోస్టర్‌ను పంచుకుంది.. "రక్తం, నమ్మకం, త్యాగంతో కూడిన ఒక సాహసోపేతమైన కథ మిమ్మల్ని భావోద్వేగ ప్రయాణంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది" అని మేకర్స్ క్యాప్షన్ జోడించారు.

తాజాగా విడుదలైన పోస్టర్‌లో మాధవ్ పోరాటంలో అలసిపోయి, ఉగ్రరూపంలో కనిపిస్తున్నారు. కథానాయకుడికి, ఒక పవిత్రమైన గోవుకు మధ్య జరిగే ప్రతీకాత్మకమైన ముఖాముఖి సీన్ గ్రామీణ కథా నేపథ్యాన్ని, సంప్రదాయాలను ఆవిష్కరించేలా ఉంది.

రూటెడ్ యాక్షన్ డ్రామాగా మారెమ్మ..

ఈ చిత్రం ద్వారా మంచాల నాగరాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతపు ఆచారాలు, బలమైన మానవ సంబంధాలు, భావోద్వేగాలతో కూడిన రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దీనిని తీర్చిదిద్దారు. దీపా బాలు కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందించగా, ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో.. సెప్టెంబర్ 10న రాబోతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Updated On
PolitEnt Media

PolitEnt Media

Next Story