Exciting Update from “Bhogi”: భోగి నుంచి క్రేజీ అప్‌డేట్.. సులోచన రాణిగా అనుపమ పరమేశ్వరన్
సులోచన రాణిగా అనుపమ పరమేశ్వరన్

Exciting Update from “Bhogi”: వైవిధ్యమైన కథలతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్. ప్రస్తుతం ఆయన మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో ‘భోగి’ అనే భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ 'కందుల సులోచన రాణి' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. "ప్రకృతి బిడ్డ.. గంగమ్మ నిలయం.. కందుల వారి గర్వం.. భోగి చిత్రానికి ఆమె ప్రాణం" అంటూ దర్శకుడు సంపత్ నంది ఆమె క్యారెక్టర్‌ను పరిచయం చేశారు. విడుదలైన పోస్టర్‌లో అనుపమ చాలా సహజంగా, గ్రేస్‌ఫుల్‌గా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆమెతో పాటు మరో కథానాయికగా డింపుల్ హయాతి కూడా ఈ సినిమాలో మెరవనుంది.
1960ల కాలం నాటి కథాంశంతో, ఉత్తర తెలంగాణ , మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ పీరియాడిక్ లుక్ కోసం చిత్ర బృందం ఎంతో శ్రమిస్తోంది. ముఖ్యంగా ఆ కాలం నాటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడం కోసం, సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఆరు నెలల పాటు కష్టపడి ఒక భారీ సెట్‌ను నిర్మించారు. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో రాజీ పడకుండా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను సిద్ధం చేస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ వీడియోకు సోషల్ మీడియాలో భారీ స్పందన లభించింది. శర్వానంద్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, సరికొత్త మేకోవర్‌తో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీని ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

