Producer Sushmita Konidela: నిర్మాత సుస్మిత కొణిదెలకు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు!
కీలక బాధ్యతలు!

Producer Sushmita Konidela: మెగాస్టార్ చిరంజీవి కుమార్తె, సినీ నిర్మాత సుస్మిత కొణిదెలకు ఆంధ్రప్రదేశ్‌లో కీలక బాధ్యత దక్కింది. విజయవాడలోని ప్రముఖ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంకు ఆమెను ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించారు. సుస్మిత నియామకానికి సంబంధించి ఏపీ దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక ఆహ్వానితురాలిగా ఆలయ అభివృద్ధి, పరిపాలనకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో సుస్మిత పాల్గొనే అవకాశం ఉంది. చిరంజీవి పెద్ద కుమార్తె అయిన సుస్మిత గతంలో తన తండ్రి చిరంజీవికి స్టైలిస్ట్‌గా పనిచేశారు. ఆ తర్వాత సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఇటీవల చిరంజీవి హీరోగా తెరకెక్కిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు ఆమె సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇదిలా ఉంటే.. చిరంజీవి భార్య కొణిదెల సురేఖకు కూడా ఇటీవల ఆలయ బాధ్యతలు దక్కాయి. తెలంగాణలోని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ బోర్డు సభ్యురాలిగా తెలంగాణ ప్రభుత్వం ఆమెను నియమించింది. మరోవైపు చిరంజీవి సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. మరో సోదరుడు నాగబాబు ఏపీ శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు. ఇటీవలే ఆయనను ఏపీ-గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా కూడా నియమించారు. దీంతో మెగా కుటుంబానికి చెందిన పలువురికి ఏపీ, తెలంగాణలో వివిధ కీలక బాధ్యతలు దక్కడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

