Adarsha Kutumbam AK47: విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఆదర్శ కుటుంబం AK47 విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే జోష్ అందుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందానికి తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవడానికి, అలాగే టికెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతినిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రిలీజ్‌కు కేవలం రెండు రోజుల ముందే ఈ అనుమతులు రావడంతో చిత్ర యూనిట్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

టికెట్ ధరల పెంపు ఇలా..

హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ప్రభుత్వానికి చేసుకున్న విజ్ఞప్తిని పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

మల్టీప్లెక్స్‌లు: ఒక్కో టికెట్‌పై గరిష్టంగా రూ. 75 వరకు అదనంగా వసూలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు.

సింగిల్ స్క్రీన్స్: ఒక్కో టికెట్‌పై రూ. 50 వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఐదో షో: రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతి లభించింది.

ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ అధికారిక జీవో జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా టికెట్ ధరల పెంపునకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్లు, స్థానిక లైసెన్సింగ్ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

వెంకీ - త్రివిక్రమ్ కాంబోపై భారీ హైప్..

గతంలో విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన కల్ట్ క్లాసిక్స్ నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా పనిచేసి సంచలనాలు సృష్టించారు. అయితే వీరిద్దరి కలయికలో త్రివిక్రమ్ పూర్తిస్థాయి దర్శకత్వం వహిస్తున్న మొట్టమొదటి చిత్రం ఇదే కావడం విశేషం.

ఔట్ అండ్ ఔట్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన స్పెషల్ షోలు, టికెట్ రేట్ల పెంపుతో ఆదర్శ కుటుంబం AK47 బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

Next Story