Art Director Thota Tharani: కళా దర్శకుడు తోట తరణికి అత్యున్నత పురస్కారం
తోట తరణికి అత్యున్నత పురస్కారం

Art Director Thota Tharani: ప్రముఖ సినీ కళా దర్శకుడు తోట తరిణికి ఫ్రాన్స్ దేశం అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన 'చెవాలియర్ డె ల'ఓర్డ్రే డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెటర్స్' అవార్డు లభించింది. కళలు, సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు తమిళనాడు సీఎం స్టాలిన్. తోట తరిణికి చెవాలియర్ పురస్కారం లభించడం తమిళనాడుకే గర్వకారణమని ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో ప్రకాశిస్తున్న పెరియార్ చిత్రపటాన్ని రూపొందించిన ఆయనకు ఈ గౌరవం దక్కడం తమ సంతోషాన్ని రెట్టింపు చేసిందని ఆయన తెలిపారు. సత్యజిత్ రే, శివాజీ గణేశన్, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, కమల్ హాసన్ వంటి మహామహులు గతంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఫ్రాన్స్ రాయబారి నవంబర్ 13న చెన్నైలోని అలయన్స్ ఫ్రాన్సైస్ ఆఫ్ మద్రాస్ లో జరిగే కార్యక్రమంలో తోట తరిణికి ఈ చెవాలియర్ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు సేవలందిస్తున్న తోట తరిణి తమిళ, తెలుగు, మలయాళ, హిందీ చిత్రాలకు కళా దర్శకుడిగా పనిచేశారు. ఇప్పటికే ఆయన రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, మూడు నంది అవార్డులతో సహా పలు పురస్కారాలు అందుకున్నారు. 2001లో భారత ప్రభుత్వం ఆయనకు 'పద్మశ్రీ' పురస్కారాన్ని ప్రదానం చేసింది.

