Bandla Ganesh’s Daughter Engagement: టాలీవుడ్ సెన్సేషనల్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఎప్పుడూ సోషల్ మీడియాలో తనదైన శైలిలో యాక్టివ్‌గా ఉండే బండ్ల గణేష్.. ఇప్పుడు ఒక తండ్రిగా తన కుమార్తెను కొత్త జీవితంలోకి పంపేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన గారాల పట్టి జనని.. త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్య తేజతో జనని వివాహం ఖాయమైంది. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం వీరిద్దరి నిశ్చితార్థ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. కేవలం కుటుంబ సభ్యుల మధ్యే కాకుండా.. రాజకీయ, సినీ రంగాలకు చెందిన దిగ్గజాల సమక్షంలో ఈ వేడుక ఒక వేడుకలా కాకుండా.. ఒక పండుగలా సాగింది.

ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి విచ్చేసి, కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. బండ్ల గణేష్‌తో ఉన్న అనుబంధంతో సీఎం దంపతులు ప్రత్యేకంగా హాజరుకావడం విశేషం.

ఇక టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బండ్ల గణేష్‌కు చిరంజీవి అంటే ఎంతటి అభిమానమో మనందరికీ తెలిసిందే.. తన ఆరాధ్య దైవమే స్వయంగా వచ్చి తన కుమార్తెను ఆశీర్వదించడంతో బండ్ల గణేష్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. వీరితో పాటు లెజెండరీ డైరెక్టర్ కె. రాఘవేంద్ర రావు, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, ప్రముఖ రచయిత కోన వెంకట్, సమంత, నాగచైతన్య, నటుడు శివాజీ, నిర్మాత సి. కళ్యాణ్ వంటి మరెంతో మంది ప్రముఖులు ఈ నిశ్చితార్థ వేడుకలో సందడి చేశారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story