“Bhoot Bangla” Editing Row: భూత్ బంగ్లా ఎడిటింగ్ వివాదం.. నెగెటివ్ ప్రచారానికి డైరెక్టర్ చెక్..
నెగెటివ్ ప్రచారానికి డైరెక్టర్ చెక్..

“Bhoot Bangla” Editing Row: బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతున్న భూత్ బంగ్లా సినిమాపై వస్తున్న కొన్ని పుకార్లకు దర్శకుడు ప్రియదర్శన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ హారర్ కామెడీ చిత్రంపై ఇటీవల సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ సినిమాలో టబు పోషించిన కీలక పాత్ర నిడివిని ఎడిటింగ్‌లో తగ్గించారని, అక్షయ్ కుమార్ పక్కన ఉండి మరీ ఆ సన్నివేశాలను కట్ చేయించారని కొన్ని విమర్శలు వచ్చాయి.
దీనిపై ప్రియదర్శన్ ఘాటుగా స్పందించారు. "సినిమాలో ఏ సన్నివేశం ఉంచాలి, ఏది తొలగించాలి అనేది దర్శకుడిగా నా బాధ్యత. అక్షయ్ కుమార్ ఎప్పుడూ ఎడిటింగ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు" అని ఆయన స్పష్టం చేశారు. టబు ఈ సినిమా పట్ల చాలా సంతోషంగా ఉన్నారని, ఆమెతో షూట్ చేసిన ప్రతీ సీన్ సినిమాలో ఉందని ప్రియదర్శన్ తెలిపారు. తమ మధ్య ఉన్న ఎనిమిది సినిమాల అనుబంధం వల్ల ఏవైనా సమస్యలు ఉంటే ఆమె నేరుగా తనకే చెబుతుందని పేర్కొన్నారు. నటీనటులందరూ సినిమా విడుదల కంటే ముందే ఫైనల్ కాపీని చూశారని, ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తున్న వారు సిగ్గుపడాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం
నెగెటివ్ కామెంట్స్ ఎన్ని వస్తున్నా, ‘భూత్ బంగ్లా’ కలెక్షన్ల జోరు మాత్రం తగ్గడం లేదు. విడుదలైన రెండు వారాల్లోనే ఈ చిత్రం రూ. 120 కోట్లకు పైగా వసూళ్లను సాధించి అక్షయ్ కుమార్ కెరీర్‌లో మరో హిట్‌ను చేర్చింది. హారర్, కామెడీ మేళవింపుతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది. సినిమా సక్సెస్ చూసి ఓర్వలేక కొందరు కావాలనే ఇటువంటి విమర్శలు చేస్తున్నారని, వీటికి తాము కృంగిపోమని చిత్రబృందం ధీమా వ్యక్తం చేసింది.

