“మిథిలా ఈ సినిమాకి కేవలం బ్యాక్‌డ్రాప్ కాదు... అదే ఈ కథ ఆత్మ” – ఉల్కా గుప్తా

బాలీవుడ్, టెలివిజన్ రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఉల్కా గుప్తా ఇప్పుడు “రజ్నీ కి బారాత్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మే 29, 2026న విడుదల కానున్న ఈ చిత్రం బీహార్, మిథిలా సంస్కృతిని ప్రతిబింబించే హృద్యమైన కథగా రూపొందింది. అలాగే ఆమె నటిస్తున్న తెలుగు సినిమాలు, మహిళా సాధికారత, ప్రేమ, వ్యక్తిగత జీవితం వంటి అనేక అంశాలపై ఉల్కా గుప్తా ప్రత్యేకంగా మాట్లాడారు.
Q : “రజ్నీ కి బారాత్” గురించి చెప్పండి. ఇది ఎలాంటి సినిమా?
A : “రజ్నీ కి బారాత్” పూర్తిగా బీహార్, మిథిలా సంస్కృతికి అద్దం పట్టే సినిమా. నేను ఎప్పుడూ చెబుతుంటాను — ఈ సినిమాలో బీహార్, మిథిలా కేవలం బ్యాక్‌డ్రాప్ కాదు… అదే ఈ కథ ఆత్మ. అక్కడి సంప్రదాయాలు, ఆప్యాయత, భావోద్వేగాలు అన్నీ ఈ చిత్రంలో చాలా సహజంగా కనిపిస్తాయి. నేను ‘రజ్నీ’ పాత్రలో నటిస్తున్నాను. ఆమె ప్రయాణం ద్వారా ప్రేక్షకులు మిథిలా సంస్కృతిలోని గొప్పతనాన్ని అనుభవిస్తారు.
Q : ఈ ప్రాజెక్ట్‌కి వెంటనే ఓకే చెప్పడానికి కారణం?
A : నేను హిందీ, తెలుగు, బెంగాలీ, మరాఠీ భాషల్లో పనిచేశాను. కానీ చాలా మంది “బీహార్‌కు సంబంధించిన ప్రాజెక్ట్ ఎందుకు చేయలేదు?” అని అడిగేవారు. సరైన కథ వస్తే తప్పకుండా చేస్తానని నేను అనుకునేదాన్ని. ఈ కథ వినగానే నాకు వ్యక్తిగతంగా ఎంతో కనెక్ట్ అయ్యింది. నా మూలాలు మిథిలా ప్రాంతానికి చెందినవే. చిన్నప్పటి జ్ఞాపకాలు కూడా గుర్తొచ్చాయి.
Q : సినిమాలో స్థానిక సంస్కృతి, భాషకు ఎక్కువ ప్రాధాన్యం కనిపిస్తోంది. అది కావాలనే చేశారా?
A : ఖచ్చితంగా. చాలామంది బీహార్ అంటే కేవలం భోజ్‌పురి మాత్రమే అనుకుంటారు. కానీ అక్కడ మైథిలీ వంటి ఎన్నో అందమైన భాషలు, సంస్కృతులు ఉన్నాయి. నేను కూడా మైథిలీ కుటుంబానికి చెందినదాన్నే కాబట్టి, సినిమాలో చూపించిన భావోద్వేగాలు, సంప్రదాయాలకు సహజంగానే కనెక్ట్ అయ్యాను.
Q : మీ పాత్ర చాలా ధైర్యంగా కనిపిస్తోంది. నిజ జీవితంలో కూడా అలానే ఉంటారా?
A : అవును. నేను వ్యక్తిగతంగా కూడా చాలా బోల్డ్‌గా ఉంటాను. మహిళా పాత్రలను బలంగా, నిజాయితీగా చూపించాలి అని నమ్ముతాను. ఈ తరం మహిళలు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నారు. ప్రేక్షకులు కూడా అలాంటి పాత్రలతో కనెక్ట్ అవుతున్నారు.
Q : మరో ప్రాజెక్ట్‌లో తొలిసారి కిస్సింగ్ సీన్ చేసినట్లు చెప్పారు. అది కష్టమైన నిర్ణయమా?
అవును. నేను సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చాను. ఇలాంటి సన్నివేశాలను గతంలో తప్పించుకునేదాన్ని. కొన్ని మంచి కథలను కూడా వదిలేశాను. కానీ ఆ సినిమా దర్శకుడు నాగేష్ కుకునూర్ గారు. కథ చాలా సున్నితంగా, అర్థవంతంగా ఉంది. ఆ సన్నివేశం కథకు అవసరమని నాకు అనిపించింది. సంచలనం కోసం కాదు. సెన్సిబిలిటీకి, వల్గారిటీకి మధ్య చాలా తేడా ఉంటుంది. ఆ సినిమా దాన్ని చాలా అందంగా చూపించింది.
Q : మీ కుటుంబం ఆ నిర్ణయానికి మద్దతిచ్చిందా?
A : ఖచ్చితంగా. నేను ముందుగా నాన్నతో మాట్లాడాను. భావోద్వేగపరంగా, ప్రొఫెషనల్‌గా నేను కంఫర్ట్‌గా ఉన్నానా అని చూసుకున్నాను. చివరకు ఆ కథ కోసం అది సరైన నిర్ణయమని అనిపించింది.
Q : చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చారు. ఎప్పుడైనా అసౌకర్యకర పరిస్థితులు ఎదురయ్యాయా?
A : నిజాయితీగా చెప్పాలంటే లేదు. మనం మనల్ని ఎలా ప్రెజెంట్ చేసుకుంటామో, ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్‌తో ఉంటామో చాలా ముఖ్యం. మీరు మీ వ్యక్తిత్వాన్ని స్పష్టంగా ఉంచుకుంటే ఎదుటివారు కూడా అదే గౌరవాన్ని ఇస్తారు. చిన్నప్పటి నుంచే పని చేయడం వల్ల మంచి గుర్తింపు వచ్చింది. అది నాకు ఇండస్ట్రీలో పాజిటివ్‌గా ముందుకు వెళ్లడానికి సహాయపడింది.
Q : ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కూడా బిజీగా ఉన్నారు కదా?
A : అవును. ప్రముఖ కమెడియన్ సప్తగిరితో “ఓం శాంతి డిస్కో శాంతి” అనే సినిమా చేస్తున్నాను. చాలా ఎంటర్‌టైనింగ్ పాత్ర. మరో సినిమా “అగాధ”. దీనిని ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు గారు నిర్మిస్తున్నారు. “వర్షం” లాంటి బ్లాక్‌బస్టర్ ద్వారా ప్రభాస్, త్రిషల వంటి నటులను పరిచయం చేసిన వ్యక్తి ఆయన. ఆయన ప్రొడక్షన్‌లో అవకాశం రావడం నాకు ఎంతో పెద్ద విషయం.
Q : “రజ్నీ కి బారాత్” తర్వాత ముందుగా విడుదలయ్యేది ఏ సినిమా?
A : ఎం.ఎస్. రాజు గారి నిర్మాణంలో వస్తున్న “అగాధ” ముందుగా విడుదలయ్యే అవకాశం ఉంది. జూలైలో రావచ్చు. అయితే ప్రతి సినిమా నాకు ప్రత్యేకమే. “రజ్నీ కి బారాత్” మాత్రం టైటిల్ రోల్ కావడం వల్ల మరింత దగ్గరగా ఉంటుంది.
Q : వ్యక్తిగత జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు?
A : నా వ్యక్తిగత జీవితం చాలా సింపుల్‌గా ఉంటుంది. నాకు మంచి కుటుంబం ఉంది. నాన్న కూడా నటుడే. మేము నలుగురు సోదర సోదరీమణులు. నేను పూర్తిగా ముంబై అమ్మాయినే. నిజానికి మా గ్రామ భాష కంటే మరాఠీనే ఎక్కువ ఫ్లూయెంట్‌గా మాట్లాడగలను.
Q : మీరు మీ సినిమాలకు మీరే డబ్బింగ్ చెప్పుకుంటారని విన్నాం?
A : అవును. అది చిన్నప్పటి నుంచి నాన్న చెప్పిన విషయం. ఒక నటుడు తన స్వరంతో డబ్బింగ్ చెప్పుకుంటే నటనకు మరింత నిజాయితీ వస్తుందని ఆయన చెప్పేవారు. బెంగాలీ, మరాఠీ, తెలుగు సినిమాలకు నేనే డబ్బింగ్ చెప్పాను. ఆ ప్రక్రియ నాకు చాలా ఇష్టం.
Q : “రజ్నీ కి బారాత్” పెళ్లి నేపథ్యంలో వస్తోంది. నిజ జీవితంలో పెళ్లిపై మీ అభిప్రాయం?
A : ఇంకా టైమ్ ఉంది. (నవ్వుతూ) ప్రేమ, బ్రేకప్ వంటి అనుభవాలు నాకు కూడా ఉన్నాయి. అవన్నీ జీవితంలో భాగమే. అవి మన గురించి మనకు చాలా నేర్పిస్తాయి.
Q : బ్రేకప్‌లు మిమ్మల్ని మార్చాయా?
A : ఖచ్చితంగా. కానీ అవి జీవితంలో ముందుకు వెళ్లడాన్ని ఆపకూడదు. ప్రతి అనుభవం మనల్ని భావోద్వేగపరంగా మరింత బలంగా మారుస్తుంది.
Q : మహిళా సాధికారత, ఫెమినిజంపై మీ అభిప్రాయం?
A : నేను సమానత్వాన్ని బలంగా నమ్ముతాను. నిజమైన ఫెమినిజం అంటే సమాన హక్కులు… ఆధిపత్యం కాదు. సోషల్ మీడియాలో కొన్ని సార్లు ఆ భావనను అతిగా చూపిస్తారు. కానీ మహిళలు తమ హక్కుల కోసం నిలబడటం, ఆర్థికంగా మరియు భావోద్వేగపరంగా స్వతంత్రంగా ఉండటం నేను పూర్తిగా సమర్థిస్తాను.
Q : మహిళలు, పురుషులు ఒకరికొకరు అవసరమని అనుకుంటారా?
A : ఖచ్చితంగా. జీవితం అనేది సమతుల్యత. మహిళలు, పురుషులు ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు. భారతీయ సంస్కృతిలో “అర్ధనారీశ్వరి” అనే భావన ఉంది. అది స్త్రీ, పురుష శక్తుల సమతుల్యతను సూచిస్తుంది. పరస్పర గౌరవం, సమానత్వం ఉన్నప్పుడే సమాజం బాగా నడుస్తుంది.
Q : చివరిగా ప్రేక్షకులకు ఏమి చెప్పాలనుకుంటున్నారు?
A : ఈ సినిమా భావోద్వేగాలు, సంస్కృతి, నిజాయితీతో ప్రేక్షకులను కనెక్ట్ చేస్తుందని ఆశిస్తున్నాను. ఇది ఎంతో హృద్యమైన, వినోదాత్మకమైన, మనసుకు దగ్గరైన కథ.

