సమంతకు చేదు అనుభవం

Actress Samantha: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఆదివారం జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు చేదు అనుభవం ఎదురైంది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద 'సిరిమల్లె శారీస్' నూతన షోరూమ్‌ను ప్రారంభించేందుకు విచ్చేసిన ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. అయితే, ఆమె తిరిగి వెళ్తున్న సమయంలో అభిమానులు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో అక్కడ గందరగోళం నెలకొంది.

షోరూమ్ ప్రారంభోత్సవం ముగించుకుని తన కారు వైపు వెళ్తున్న సమంతను వందలాది మంది అభిమానులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. సెల్ఫీల కోసం ఫోన్లను ఆమె ముఖానికి దగ్గరగా పెట్టడం, తోపులాట జరగడంతో సమంత తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. బౌన్సర్లు, భద్రతా సిబ్బంది అతికష్టం మీద జనాన్ని అడ్డుకుంటూ ఆమెను కారు వరకు చేర్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛ, భద్రతపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కేవలం కొన్ని రోజుల క్రితమే (డిసెంబర్ 17న) నటి నిధి అగర్వాల్‌కు కూడా ఇటువంటి పరిస్థితే ఎదురైంది. కూకట్‌పల్లిలోని లులు మాల్‌లో ప్రభాస్ సినిమా 'ది రాజా సాబ్' సాంగ్ లాంచ్ ఈవెంట్ కోసం వెళ్లిన ఆమెను ఆకతాయిలు చుట్టుముట్టి ఇబ్బంది పెట్టారు. ఈ ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యి, అనుమతి లేకుండా ఈవెంట్ నిర్వహించినందుకు మాల్ యాజమాన్యం, నిర్వాహకులపై సుమోటోగా కేసు నమోదు చేశారు.

వరుసగా జరుగుతున్న ఈ సంఘటనలు సినీ అభిమానుల ప్రవర్తనపై చర్చకు దారితీస్తున్నాయి. అభిమానం పేరుతో సెలబ్రిటీల వ్యక్తిగత పరిధులు దాటడం సరైనది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా భారీ బహిరంగ కార్యక్రమాల్లో సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story