Deepfake Content: డీప్‌ఫేక్ కంటెంట్‌పై బాంబే హైకోర్టు సీరియస్.. నటి ప్రీతి జింటా పిటిషన్‌తో రంగంలోకి దిగిన గూగుల్, మెటా..
గూగుల్, మెటా..

Deepfake Content: సంచలనం సృష్టిస్తున్న ఏఐ సాంకేతికత ఇప్పుడు సెలబ్రిటీల వ్యక్తిగత గౌరవానికి సవాలుగా మారింది. ఇంటర్నెట్‌లో తన పేరుతో సర్క్యులేట్ అవుతున్న అసభ్యకర డీప్‌ఫేక్ చిత్రాలు, మార్ఫింగ్ కంటెంట్‌కు వ్యతిరేకంగా బాలీవుడ్ సీనియర్ నటి ప్రీతి జింతా బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఈ అభ్యంతరకర లింకులను తక్షణమే ఇంటర్నెట్ నుండి తొలగించేలా అత్యవసర ఉత్తర్వులు జారీ చేయాలని ఆమె కోర్టును అభ్యర్థించింది.
న్యాయస్థానం కీలక ఆదేశాలు
ప్రీతి జింతా దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు.. వెబ్‌సైట్ల నుండి ఇటువంటి తప్పుడు, మార్ఫింగ్ కంటెంట్‌ను వేగంగా తొలగించడానికి ఒక ఆచరణాత్మక విధానాన్ని రూపొందించాలని టెక్ దిగ్గజాలను ఆదేశించింది. ఈ కేసులో గూగుల్, మెటా వంటి ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థలతో పాటు డొమైన్ నేమ్ రిజిస్ట్రార్లను కూడా ప్రతివాదులుగా చేర్చారు. నటి తరఫు సీనియర్ న్యాయవాది వెంకటేశ్ ధోండ్ కోర్టులో వాదనలు వినిపిస్తూ.. రోజురోజుకూ ఏఐ సాంకేతికత పెరిగిపోతోందని, డీప్‌ఫేక్ చిత్రాలు నిజమైన వాటిలాగే కనిపిస్తూ బాధితుల ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
టెక్ దిగ్గజాల స్పందన
కోర్టు ఆదేశాలపై గూగుల్, మెటా సంస్థల న్యాయవాదులు స్పందిస్తూ.. వివాదాస్పదంగా మారిన అభ్యంతరకర లింకులను తొలగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపారు. అయితే సాధారణ వినియోగదారులు పెట్టే చట్టబద్ధమైన కంటెంట్‌ను ముందస్తుగానే బ్లాక్ చేసేలా కఠినమైన ఆంక్షలు విధించవద్దని వారు న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. సాధారణ యూజర్ల కంటెంట్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తూనే, కేవలం అభ్యంతరకరమైన, మార్ఫింగ్ చేసిన లింకులను మాత్రమే ఇంటర్నెట్ నుండి అత్యంత వేగంగా తొలగించేలా ఒక ప్రత్యేక ప్రోటోకాల్‌ను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఈ డీప్‌ఫేక్ నివారణా చర్యలపై తదుపరి విచారణను కోర్టు ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది.

