Prabhas’ ‘Fauji’ : పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఆయన తాజా పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’ టీజర్ విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చారిత్రక విజువల్ వండర్ నుంచి వచ్చిన ఈ వీడియో సినీ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా సినిమా విడుదల తేదీపై కూడా చిత్ర బృందం స్పష్టత ఇచ్చింది. తొలుత ఈ ఏడాది డిసెంబర్ 3న అనుకున్నప్పటికీ, చిత్రాన్ని 2027 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

టీజర్‌లో బోస్ - హిట్లర్ సీక్రెట్ మీటింగ్!

టీజర్ ఆరంభమే భారీ క్యూరియాసిటీని పెంచింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బెర్లిన్ వేదికగా నేతాజీ సుభాష్ చంద్రబోస్, జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ మధ్య సాగిన ఏకాంత భేటీ దృశ్యాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చేందుకు జర్మనీ మద్దతును బోస్ కోరతారు. అయితే దాదాపు రెండు వందల ఏళ్లుగా భారత్‌ను ఏలుతున్న బ్రిటన్‌పై పోరాటం ఓటమికి దారితీస్తుందని, అలాంటి ఉద్యమానికి తాను తోడ్పడలేనని హిట్లర్ స్పష్టం చేస్తాడు.

ఎనిగ్మాను మించిన రహస్య కోడ్.. బ్రిటిష్ పాలకులకే అంతుచిక్కని గూఢచారి..

హిట్లర్ మాటలకు బదులిస్తూ భారతీయుల పరాక్రమం, వ్యూహ చతురత ఎలాంటిదో నేతాజీ వివరిస్తారు. బ్రిటిష్ సైన్యానికి జర్మనీ సీక్రెట్ ఏజెంట్ల ఆచూకీ తెలుసు కానీ, ఒక భారతీయ అజ్ఞాత వీరుడి గురించి కనీస సమాచారం లేదని చెబుతారు. సింగపూర్‌ను బ్రిటన్ నుంచి జపాన్ సైన్యం కైవసం చేసుకోవడంలో ఆ వీరుడు కీలక పాత్ర పోషించాడని టీజర్ స్పష్టం చేస్తోంది. కేవలం సైనికుడిగానే కాకుండా వ్యూహకర్తగా, అగ్రశ్రేణి గూఢచారిగా అతడు చేసిన సాహసాలు ఇందులో ప్రధానం. జర్మనీకి చెందిన ప్రసిద్ధ ఎనిగ్మా కోడ్ కంటే సంక్లిష్టమైన రహస్య కోడ్ భాషను ఆ యోధుడు భగవద్గీతలోని శ్లోకాలు, తాత్విక ఆధారాలతో రూపొందించాడని, దాన్ని ఛేదించడం అసాధ్యమని బ్రిటీష్ వర్గాలే అంగీకరించాయని చూపించారు. అసలు పేరేంటో ఎవరికీ తెలియని ఆ ధైర్యశాలిని బ్రిటిష్ సైనికులు పిలిచే ఏకైక పేరు.. ఫౌజీ

భారీ కాస్టింగ్.. పీరియాడిక్ కథా నేపథ్యం

1940ల నాటి ఉత్కంఠభరిత వాతావరణంలో, చారిత్రక సంఘటనల స్ఫూర్తితో రూపొందుతున్న కల్పిత కథ ఇది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా.. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్, జయప్రద వంటి సీనియర్ అగ్ర నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకూరుస్తుండగా, సుదీప్ ఛటర్జీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇది పౌరాణిక చిత్రం కాదని, భగవద్గీత నుంచి తాత్విక ప్రేరణను మాత్రమే తీసుకున్నామని, బ్రిటిష్ పాలన నాటి దేశభక్తి, గాఢమైన భావోద్వేగాలు, సామాజిక-రాజకీయ పోరాటాలే కథకు ఆత్మ అని దర్శకుడు హను రాఘవపూడి స్పష్టం చేశారు.

Next Story