Champion Movie: బాక్సాఫీస్ వద్ద ఛాంపియన్ ప్రభంజనం.. తొలిరోజే భారీ వసూళ్లు..
తొలిరోజే భారీ వసూళ్లు..

Champion Movie: టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఛాంపియన్. భారీ అంచనాల మధ్య క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించింది. కేవలం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 4.5 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది.
బ్రిటీష్ కాలం నాటి బైరాన్‌పల్లి గ్రామంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. రోషన్ సరసన మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ కథానాయికగా నటించి మెప్పించింది. ప్రదీప్ అద్వైతం ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ఆయన ప్రతిభకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మించారు.
తెలంగాణ ప్రాంతంలోని ఒక వీరోచిత పోరాటాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. లాంగ్ వీకెండ్ కావడంతో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

