Buchi Babu Apologizes: దర్శకుడు బుచ్చిబాబు సానా శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, తన తాజా చిత్రం "పెద్ది"లో జాన్వీ కపూర్‌కు సంబంధించిన కొన్ని సీన్ల పట్ల విచారం వ్యక్తం చేశారు. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా సినిమాలో కొన్ని మార్పులు చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించిందని ఆయన తెలిపారు. సినిమా ప్రారంభంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ మధ్య వచ్చే కొన్ని సీన్లు చాలా ఘోరంగా, అసభ్యంగా ఉన్నాయని, అవి కథకు అస్సలు అవసరం లేదని పలువురు సినీ విమర్శకులు తమ రివ్యూల్లో పేర్కొన్నారు. రొమాన్స్, గ్లామర్ పేరుతో జాన్వీ కపూర్ పాత్రను మరీ మితిమీరిన రంగుల్లో, శృతిమించి చూపించారని చాలా మంది అభిప్రాయపడ్డారు.

ఈ విమర్శలపై స్పందించిన బుచ్చిబాబు.. తెరపై అయినా, నిజ జీవితంలో అయినా తనకు మహిళల పట్ల ఎప్పుడూ "అపారమైన గౌరవం" ఉంటుందని చెప్పారు. ప్రేక్షకులు, విమర్శకుల నుంచి వచ్చిన స్పందనను మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ ఆయన క్షమాపణలులు కోరారు. వివాదాస్పదంగా మారిన ఆ సీన్లను రాబోయే రోజుల్లో మారుస్తామని, అందుకు తగ్గట్టుగా అవసరమైన మార్పులు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

ఒక దర్శకుడిగా సినిమా అనేది ప్రేక్షకులను అలరించడానికి, స్ఫూర్తినింపడానికి మరియు వారితో కనెక్ట్ అవ్వడానికి మాత్రమేనని తాను నమ్ముతానని బుచ్చిబాబు పేర్కొన్నారు. సినిమా ఎవరికీ అసౌకర్యాన్ని కలిగించకూడదని, ఎవరినీ అవమానించేలా ఉండకూడదని చెప్పారు. ‘పెద్ది’ చిత్రంలోని కొన్ని సీన్లపై వచ్చిన స్పందనను తాము చాలా తీవ్రంగా తీసుకున్నామని వివరించారు.

మహిళలను కించపరచాలనే ఉద్దేశం తమకు ఎప్పుడూ లేదని, ఒకవేళ సినిమాలో ఏదైనా భాగం అలా అనిపించి ఉంటే, ప్రేక్షకుల సెంటిమెంట్లను తాము గౌరవిస్తున్నామని బుచ్చిబాబు అన్నారు. మారుతున్న ప్రేక్షకుల ఆలోచనలు, వారి భావాలకు అనుగుణంగా కథలు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ప్రతి మహిళకు గౌరవం, విలువ ఇవ్వాలని, వారిని గౌరవప్రదంగా చూపించాలని తాను నమ్ముతానని, భవిష్యత్తులోనూ బలమైన పాత్రలతో మంచి సినిమాలు తీయడానికి కట్టుబడి ఉంటానని చెబుతూ, తమ అభిప్రాయాలను నిజాయితీగా పంచుకున్న ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Next Story