‘AA23’లో శ్రద్ధా కపూర్?

Bunny–Lokesh Movie Update: సంక్రాంతి పండుగ సందర్భంగా అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ అధికారికంగా ఖరారు కావడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ‘మైత్రీ మూవీ మేకర్స్’ నిర్మాణంలో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ టీజర్ సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తూ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న అల్లు అర్జున్, ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే లోకేష్ సినిమాను పట్టాలెక్కించనున్నారు.

ఈ మెగా ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా ఎవరు నటించబోతున్నారనే దానిపై ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ‘స్త్రీ 2’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మంచి ఫామ్‌లో ఉన్న శ్రద్ధా అయితే, ఈ చిత్రానికి నార్త్ ఇండియాలో కూడా మరింత క్రేజ్ వస్తుందని లోకేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెకు స్క్రిప్ట్ వినిపించారని, త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

నిజానికి, ‘పుష్ప 2’లో ఒక స్పెషల్ సాంగ్ కోసం శ్రద్ధా కపూర్‌ను సంప్రదించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ స్థానంలో శ్రీలీల ఎంపికయ్యారు. ఇప్పుడు ‘AA23’లో ఆమె ఏకంగా మెయిన్ హీరోయిన్‌గా సెలెక్ట్ అయితే, అల్లు అర్జున్ సరసన ఆమె నటించే మొదటి సినిమా ఇదే అవుతుంది. గతంలో ప్రభాస్ సరసన ‘సాహో’లో నటించిన శ్రద్ధాకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. ఒకవేళ ఈ జోడీ ఖరారైతే బాక్సాఫీస్ వద్ద సరికొత్త మేజిక్ జరగడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో, అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్‌తో రూపొందనుంది. లోకేష్ మార్క్ ఇంటెన్స్ నెరేషన్‌కు అల్లు అర్జున్ స్వాగ్ తోడైతే వెండితెరపై పూనకాలేనని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, జూన్ లేదా జూలై 2026 నాటికి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ లోపు హీరోయిన్ మరియు ఇతర నటీనటుల గురించి మైత్రీ మూవీ మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story