స్టార్ డైరెక్టర్‌పై కేసు నమెదు

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తన తాజా చిత్రం 'లవ్ అండ్ వార్' షూటింగ్‌కు సంబంధించి వివాదంలో చిక్కుకున్నారు. సినిమా కోసం లైన్ ప్రొడ్యూసర్‌గా పనిచేసిన వ్యక్తిని మోసం చేయడమే కాకుండా ఆయనపై దాడి చేసి బెదిరించినట్లు వచ్చిన ఆరోపణలపై రాజస్థాన్‌లో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

రాజస్థాన్‌లోని బికనీర్‌ జిల్లాలోని బిచ్వాల్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం రాత్రి ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. జోధ్‌పూర్‌కు చెందిన రాధా ఫిల్మ్స్ అండ్ హాస్పిటాలిటీ సీఈఓ ప్రతీక్ రాజ్ మాథుర్ ఈ ఫిర్యాదు చేశారు. భన్సాలీ తన 'లవ్ అండ్ వార్' చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్‌గా నియమించుకున్నారు. దీనికి సంబంధించి అధికారిక ఒప్పందం లేనప్పటికీ, ఈ-మెయిల్ ద్వారా ఒప్పందాన్ని ధ్రువీకరించారు. మాథుర్ ప్రభుత్వ అనుమతులు, భద్రతా ఏర్పాట్లు వంటి కీలక పనులన్నీ చూసుకున్నారు. అయితే ఆ తర్వాత ఆయనను తొలగించి, ఇవ్వాల్సిన పారితోషికం చెల్లించలేదని మాథుర్ ఆరోపించారు.

ఆగస్టు 17న బికనీర్‌లోని హోటల్‌లో భన్సాలీ, ఆయన ప్రొడక్షన్ మేనేజర్లు ఉత్కర్ష్ బాలి, అర్వింద్ గిల్ తనను తోసివేసి, తీవ్ర పదజాలంతో దూషించారని మాథుర్ ఆరోపించారు. భవిష్యత్తులో తన కంపెనీకి అవకాశాలు రాకుండా అడ్డుకుంటామని బెదిరించారని కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నమ్మకద్రోహం, చీటింగ్ కింద కేసు నమోదు చేశారు. ముందుగా పోలీసులు కేసు నమోదు చేయడానికి నిరాకరించడంతో, మాథుర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఆరోపణలపై అన్ని పక్షాల వాదనలను పరిశీలిస్తున్నామని, దర్యాప్తు ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు.

కాగా, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో బికనీర్‌లోని జునాగఢ్ కోట వంటి ప్రదేశాల్లో జరిగింది. డిసెంబర్‌లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో 'పద్మావత్' సినిమా సమయంలో కూడా భన్సాలీ రాజస్థాన్‌లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story