బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదు

Producer Bellamkonda Suresh: టాలీవుడ్‌లో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఫిల్మ్‌నగర్ రోడ్ నంబర్ 7లోని ఒక ఆస్తిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. శివ ప్రసాద్ అనే వ్యక్తి ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో బెల్లంకొండ సురేష్‌పై ఫిర్యాదు చేశారు. శివ ప్రసాద్ ఫిర్యాదు ప్రకారం, కొంతకాలంగా తాళం వేసి ఉన్న తన ఇంటిని (ఫిల్మ్‌నగర్ రోడ్ నంబర్ 7) బెల్లంకొండ సురేష్ తన అనుచరులతో కలిసి బలవంతంగా ఆక్రమించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో సురేష్ ఆయన అనుచరులు ఇంటి తాళం పగలగొట్టి లోపల ప్రవేశించారు. ఇంట్లోని సామాగ్రిని, గోడలను ధ్వంసం చేశారని ఫిర్యాదుదారు ఆరోపించారు. ఈ విషయం తెలుసుకుని ఆస్తి వద్దకు వచ్చిన శివ ప్రసాద్ సిబ్బందిపై కూడా బెల్లంకొండ సురేష్ దుర్భాషలాడి, దాడికి యత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు ఫిల్మ్‌నగర్ పోలీసులు నిర్మాత బెల్లంకొండ సురేష్‌తో పాటు మరో వ్యక్తిపై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్లు 329(4) (బలవంతంగా అక్రమంగా ప్రవేశించడం), 324(5) (ఆస్తి నష్టం), 351(2) (దౌర్జన్యం/దాడి) కింద కేసు నమోదు చేశారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. బెల్లంకొండ సురేష్ గతంలో కూడా చెల్లింపులకు సంబంధించిన ఛీటింగ్ కేసులు ఇతర వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే.

PolitEnt Media

PolitEnt Media

Next Story