Rahul Sipligunj: నాటు నాటు పాటతో ఆస్కార్ వేదికపై అలరించి అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రముఖ గాయకుడు, బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ చుట్టూ కొత్త వివాదం ముసురుకుంది. విశాఖపట్నంలో ఒక యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.

ఫిర్యాదులో యువతి చేసిన ప్రధాన ఆరోపణలు..

పెళ్లి పేరుతో మోసం, బ్లాక్‌మెయిల్

విశాఖకు చెందిన బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కర్పూరపు రాహుల్ రెడ్డి అనే వ్యక్తి తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని పేర్కొంది. అంతేకాకుండా తన వద్ద ఉన్న వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను చూపిస్తూ నిందితుడు తీవ్రంగా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాడని ఆరోపించింది.

రాహుల్ సిప్లిగంజ్ జోక్యం - బెదిరింపులు:

ఈ వ్యవహారంలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ప్రమేయం కూడా ఉందని బాధితురాలు తెలిపింది. రాహుల్ రెడ్డికి తాను బంధువునంటూ చెప్తూ, తనను తీవ్రంగా బెదిరించారని.. బలవంతంగా కొన్ని వీడియో స్టేట్‌మెంట్లు కూడా ఇప్పించారని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది.

16 మందిపై కేసు నమోదు – విచారణ ముమ్మరం:

బాధితురాలి సంచలన ఆరోపణల నేపథ్యంలో రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు మొత్తం 16 మందిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రారంభంలో ఈ కేసును ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసినప్పటికీ, తదుపరి సమగ్ర విచారణ నిమిత్తం దీనిని

ఎండాడ మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ వివాదంలో మధ్యవర్తిత్వం వహించినట్లు చెబుతున్న కొందరు జర్నలిస్టులు, తెలంగాణ హైకోర్టు న్యాయవాది గీతా ప్రసన్న చందన పేర్లను కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు సమాచారం.

ప్రస్తుతం పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే తనపై నమోదైన కేసు, ఆరోపణలపై సింగర్ రాహుల్ సిప్లిగంజ్ లేదా ఆయన టీమ్ నుండి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణగానీ, స్పందనగానీ వెలువడలేదు.

PolitEnt Media

PolitEnt Media

Next Story