Celebration for Pawan Kalyan Fans: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పండుగ.. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ వచ్చేసింది..
ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ వచ్చేసింది..

Celebration for Pawan Kalyan Fans: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి చిత్రబృందం తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్‌ను ప్రకటించింది. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ఈ కీలక విషయాన్ని వెల్లడించింది. త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి మొదటి పాట ప్రకటన ఉంటుందని అధికారికంగా ప్రకటించింది.
డిసెంబర్ నెల పవర్ స్టార్ వేడుక
నిర్మాతలు తమ ప్రకటనలో పవన్ కల్యాణ్ ఎనర్జీ గురించి ఉత్సాహంగా పేర్కొన్నారు. "మీరు ఇష్టపడే ఎనర్జీ, మీరు ఆస్వాదించే డ్యాన్స్, మీరు వేడుక చేసుకునే యాటిట్యూడ్.. ఇవన్నీ ఒకే పాటలో మా కల్ట్ కెప్టెన్ హరీశ్ శంకర్ అందిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ ప్రకటన త్వరలోనే వస్తుంది. డిసెంబర్ నెల పవర్ స్టార్ వేడుకగా మారుతుంది." అని ట్వీట్ చేశారు.
ఈ పోస్ట్‌తో పవన్ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది.
ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఎనర్జీ, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, హరీశ్ శంకర్ టేకింగ్ కలగలిసి థియేటర్లలో పూనకాలు ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. త్వరలో రాబోయే ఈ పాట కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

