Chennai’s Iconic Albert Theatre: చెన్నై మహానగరంలోని ఎగ్మోర్ ప్రాంతానికి చిరకాలం గుర్తింపుగా నిలిచిన ఐకానిక్ ఆల్బర్ట్ థియేటర్ ఇకపై కనుమరుగు కానుంది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తమిళ సినీ ప్రేక్షకులకు వినోదం అందించిన ఈ సినిమా కాంప్లెక్స్ శాశ్వతంగా మూతపడిందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. 1984లో ప్రారంభమైన ఈ థియేటర్ ఎగ్మోర్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉండటంతో సులభంగా చేరుకోవడం వల్ల అప్పటి నుంచి ప్రజాదరణ పొందింది. ఆల్బర్ట్‌లో 1200 సీట్లు, బేబీ ఆల్బర్ట్‌లో 240 సీట్లతో మొత్తం 1440 సీట్ల సామర్థ్యం ఉండేది.

ఈ థియేటర్ సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ వంటి హీరోల చిత్రాలకు ప్రధాన వేదికగా నిలిచింది. రజనీకాంత్ సినిమాల విడుదల సందర్భంగా భారీ కటౌట్లు, పాలాభిషేకాలు, బాణాసంచా వేడుకలతో ఇక్కడ సందడి నెలకొనేది. అనేక చిత్రాలు వంద రోజులకు పైగా ప్రదర్శితమై శతదినోత్సవ వేడుకలు జరిపుకున్నాయి. ఇటీవల సీఎం విజయ్ నటించిన ‘జన నాయగన్’ చిత్రాన్ని చివరిసారిగా ప్రదర్శించిన అనంతరం థియేటర్ మూతపడింది.

కొవిడ్ మహమ్మారి తర్వాత ప్రేక్షకుల సినిమా చూసే అలవాట్లలో భారీ మార్పులు వచ్చాయి. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల అందుబాటు, మల్టీప్లెక్స్‌ల పెరుగుదల, పాత ప్రొజెక్షన్ సిస్టమ్, సీటింగ్ సదుపాయాల కొరత, ఆధునీకరణ లేకపోవడం వంటి కారణాలతో ఫుట్‌ఫాల్ గణనీయంగా తగ్గింది. దీంతో నిర్వహణ ఖర్చులు భరించలేక థియేటర్‌ను మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆస్తిని విక్రయించి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించే అవకాశాలు కూడా ఉన్నాయని చర్చలు జరుగుతున్నాయి.

ఇప్పటికే చెన్నైలో అబిరామి, శాంతి, నాగేష్, సఫైర్, గెయిటీ, వెల్లింగ్టన్, రాక్సీ, మేఘల, భువనేశ్వరి, చిత్ర, కబాలి, ఉమ, రాజకుమారి, పారగన్, ప్లాజా, నేషనల్, వాణి, వసంతి, ఆనంద్, లియో, అలంకార్, పైలెట్, ప్రసాద్, మోక్షం, రామ్, జయప్రద, లిబర్టీ, మెలోడీ, బ్రాడ్‌వే సహా పలు పురాతన థియేటర్లు మూతపడ్డాయి. వాటి స్థానంలో ఇతర భవనాలు నిర్మించబడ్డాయి. ఆల్బర్ట్ థియేటర్ కూడా అదే బాటలో పయనిస్తోంది. రజనీ అభిమానులకు ఇది ఓ దుఃఖకరమైన వార్తగా మారింది. ఒకప్పుడు సినిమా వేడుకలకు కేంద్రంగా ఉన్న ఈ చోటు ఇప్పుడు నిశ్శబ్దంగా మారింది. పాత సినిమా హాళ్ల మనుగడపై ఆధునిక సాంకేతికత, ప్రేక్షకుల అలవాట్లు ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. చెన్నై సినీ చరిత్రలో ఒక యుగం ముగిసిందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story