Chinmayi: గాయని, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద మరోసారి ఆన్‌లైన్ వేధింపులపై తీవ్రంగా స్పందించారు. తన కుటుంబంపై, ముఖ్యంగా తన మూడేళ్ల కవల పిల్లలపై కొందరు వ్యక్తులు అత్యంత దారుణంగా అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏకంగా తమ పిల్లల మరణాన్ని కోరుకుంటూ, వారి అంత్యక్రియల గురించి కామెంట్లు చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తన భర్త, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విట్టర్) నుంచి తప్పుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ మేరకు ఆమె 'ఎక్స్' ఖాతాలో ఏడు నిమిషాల నిడివి గల ఒక వీడియోను పోస్ట్ చేస్తూ తన ఆవేదనను పంచుకున్నారు.

లైంగిక దాడుల బాధితులకు మద్దతుగా నిలుస్తున్నందుకు తాను ఎప్పటినుంచో ఆన్‌లైన్‌లో విపరీతమైన ట్రోలింగ్, దూషణలు ఎదుర్కొంటున్నానని చిన్మయి ఈ వీడియోలో తెలిపారు. తాజాగా పోస్ట్ చేసిన ఈ వీడియోలో రేప్ కల్చర్, మహిళలపై వివక్ష, సమ్మతి (కన్సెంట్) వంటి కీలకమైన అంశాలపై ఆమె మాట్లాడారు. ఈ సమాజంలో ఒక మహిళ గొంతు విప్పితే, ఆమెకు అండగా నిలబడే మగాడిని కూడా లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తారని, అందుకే తనకు ఎందుకు విడాకులు ఇవ్వలేదని ప్రశ్నిస్తూ తన భర్త రాహుల్‌ను కూడా ట్రోలర్స్ టార్గెట్ చేశారని ఆమె మండిపడ్డారు. పిల్లల చావును కోరుకుంటూ చేసిన పోస్టులు చూసిన తర్వాతే రాహుల్ ఆన్‌లైన్ వేధింపులను భరించలేక ఖాతాను డిలీట్ చేశారని ఆమె స్పష్టం చేశారు.

అలాగే ఈ వీడియోలో 'రేప్ కల్చర్ పిరమిడ్' గురించి కూడా చిన్మయి వివరంగా మాట్లాడారు. లైంగిక హింస అనేది రాత్రికి రాత్రే పుట్టుకురాదని, దానికి ముందు అనేక సంఘటనలు జరుగుతాయని ఆమె వివరించారు. మహిళలపై అసభ్యకరమైన జోకులు వేయడం, వారిని కించపరిచేలా మీమ్స్ క్రియేట్ చేయడం, రివెంజ్ పోర్న్ వంటివి సమాజంలో నెమ్మదిగా సాధారణ విషయాలుగా మారిపోవడం వల్లే అంతిమంగా ఇలాంటి దారుణాలకు బీజం పడుతుందని ఆమె విశ్లేషించారు. వేధింపులకు పాల్పడేవారికి ఆమె తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ, తాను మాత్రం భయపడి వెనక్కి తగ్గేది లేదని, ఇక్కడే ఉండి పోరాడుతానని చిన్మయి తేల్చి చెప్పారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story