Nani: చిరు - శ్రీకాంత్ ఓదెల మూవీపై సస్పెన్స్.. ప్రాజెక్ట్ లేట్ అవ్వడానికి కారణం చెప్పిన నాని..
కారణం చెప్పిన నాని..

Nani: మెగాస్టార్ చిరంజీవి, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రావాల్సిన క్రేజీ ప్రాజెక్ట్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. నేచురల్ స్టార్ నాని సమర్పణలో రూపొందాల్సిన ఈ భారీ చిత్రం ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదు. ఈ సినిమా మరింత ఆలస్యం కానుందని నాని స్వయంగా స్పష్టం చేయడంతో మెగా అభిమానులు నిరాశకు గురవుతున్నారు. 2024 డిసెంబర్‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. చిరంజీవి కెరీర్‌లోనే మునుపెన్నడూ చూడని అత్యంత వయోలెంట్ ఫిలింగా ఇది తెరకెక్కనుందనే ప్రచారంతో ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రకటన వచ్చి ఇంతకాలమైనా సినిమా సెట్స్‌పైకి వెళ్లకపోవడంపై తాజాగా నాని స్పష్టతనిచ్చారు.
అనుకున్న సమయం కంటే లేట్ అయింది.. నాని క్లారిటీ
ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ది ప్యారడైజ్ మూవీ నిర్మాణం అనుకున్న షెడ్యూల్ కంటే ఎక్కువ సమయం తీసుకోవడమే ఈ ఆలస్యానికి ప్రధాన కారణమని తెలిపారు. "షెడ్యూల్ ప్రకారం చూస్తే.. ఈపాటికి చిరంజీవి గారి సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవాల్సింది. కానీ ది ప్యారడైజ్ ఆలస్యం కావడంతో కుదరలేదు. దీనిపై మేమింకా కూర్చుని మాట్లాడుకోలేదు, ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి మరికొంత సమయం పడుతుంది" అని నాని తేల్చిచెప్పారు. ఈ విరామంలో చిరంజీవి కూడా తన ఇతర కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.
డేట్లు కుదిరితేనే పట్టాలెక్కే ఛాన్స్
ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోనప్పటికీ.. చిరంజీవి, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాల్షీట్లు తిరిగి సర్దుబాటు అయిన తర్వాతే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఆలస్యమైనా సరే.. ఈ వైవిధ్యమైన మాస్ కాంబినేషన్ వెండితెరపై ఎలా ఉండబోతోందన్న ఆసక్తి మాత్రం సినీ వర్గాల్లో కొనసాగుతూనే ఉంది.

