‘Aalochana’: సురేందర్ చాచా దర్శకత్వంలో తెరకెక్కిన సందేశాత్మక చిత్రం ‘ఆలోచన’ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్‌పై ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. సీనియర్ నటులు జీవీ నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, మహర్షి రాఘవ, జయలలిత, రజన్ హరి, బెన్నీ సుధాకర్ కీలక పాత్రల్లో నటించారు.

ట్రైలర్ లాంచ్ అనంతరం చిరంజీవి మాట్లాడుతూ, “ఇది నిజంగానే మంచి ఆలోచన. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. నా క్లాసిక్ చిత్రం ‘మంచు పల్లకి’ స్ఫూర్తితో ఈ సినిమా తయారైందని చెప్పారు. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని ప్రశంసలు కురిపించారు. వృద్ధాప్యం, స్నేహం, మానవత్వం, కుటుంబ విలువలను హృదయాన్ని తాకేలా చూపించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ప్రీమియర్‌కు ఆర్.నారాయణమూర్తి, మురళీమోహన్, తమ్మారెడ్డి భరద్వాజ్, కరాటె కళ్యాణి, నటి రాగిణి అతిథులుగా హాజరయ్యారు. రొటీన్‌కి భిన్నంగా ఉందని మురళీమోహన్ అన్నారు. తల్లిదండ్రులను దేవుడితో సమానంగా చూడాలని, కుటుంబ విలువలను కాపాడుకోవాలనే గొప్ప సందేశాన్ని ఈ చిత్రం ఇస్తోందని ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. సినిమాను విడుదల చేస్తున్న సురేష్ కొండేటి, చిరంజీవి ట్రైలర్ లాంచ్ చేయడం సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ థియేటర్‌లో చూసి ఆదరించాలని కోరారు.

నటీనటులు నరసింహరాజు, జయలలిత, బెన్నీ సుధాకర్, అనుపమ, మాధవితో పాటు దర్శకనిర్మాతలు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్లకు నవంబర్ 27, 28, 29 తేదీల్లో ఆధార్ కార్డు చూపిస్తే ఉచితంగా సినిమా చూసే అవకాశం కల్పించారు. టికెట్ ధర రూ.100గా ఉంచి సామాన్య ప్రేక్షకులకు అందుబాటులో ఉంచారు. వృద్ధులను విదేశాలకు వెళ్లిపోయిన పిల్లలు వదిలేసే సమస్యను హృదయవంతంగా చూపించే ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Next Story