Chiranjeevi’s ‘Mega 158’: మెగా 158 అప్డేట్: ఏప్రిల్ 11న మెగాస్టార్ కొత్త సినిమా ప్రారంభం!
ఏప్రిల్ 11న మెగాస్టార్ కొత్త సినిమా ప్రారంభం!

Chiranjeevi’s ‘Mega 158’: మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రం 'మెగా 158' (వర్కింగ్ టైటిల్) ఎట్టకేలకు పట్టాలెక్కడానికి సిద్ధమైంది. ఎన్నో వాయిదాల తర్వాత ఈ సినిమా ప్రారంభానికి లైన్ క్లియర్ కావడంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. నిజానికి ఈ ప్రాజెక్ట్ గురించి చాలా కాలం క్రితమే ప్రకటించారు, కానీ నిర్మాణ సంస్థ ఎదుర్కొన్న కొన్ని అంతర్గత సమస్యల వల్ల షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది.
బెంగళూరుకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ 'కేవీఎన్ ప్రొడక్షన్స్' ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించ తలపెట్టింది. దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అయితే, ఈ బ్యానర్‌కు సంబంధించి విజయ్ నటించిన 'జన నాయకన్' సెన్సార్ చిక్కులు, అలాగే యశ్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమా వాయిదా పడటంతో ఆర్థిక పరమైన ఒత్తిళ్లు తలెత్తాయి. దీనివల్ల చిరంజీవి సినిమా లాంచ్ చేయడం ఆలస్యమైందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ప్రస్తుతం పరిస్థితులన్నీ చక్కబడటంతో, మేకర్స్ ఈ సినిమాను ఏప్రిల్ 11న అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉండబోతున్నారని తెలుస్తోంది. ఒకరు చిరంజీవి భార్య పాత్రలో, మరొకరు ఆయన కుమార్తె పాత్రలో కనిపిస్తారట.
ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించే అవకాశం ఉంది. గతంలో చిరంజీవి - బాబీ కాంబినేషన్‌లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. మళ్లీ వీరిద్దరి కలయికలో సినిమా వస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

