Choreographer Jani Master: తెలుగు సినిమా టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ సమావేశంలో.. కొరియోగ్రాఫర్స్ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య పెద్ద గొడవ జరిగిందంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వైరల్ వీడియోలు, రూమర్లపై తాజాగా జానీ మాస్టర్, అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత ఘాటుగా స్పందించారు.

తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. తామంతా ఒకే గూటి పక్షులం, ఒకే కుటుంబంలా కలిసి పనిచేస్తామని జానీ మాస్టర్ స్పష్టం చేశారు. ఈ వైరల్ వీడియోలను చూసి స్వయంగా మెగాస్టార్ చిరంజీవి కూడా షూటింగ్ స్పాట్‌లో తమను ఆరా తీశారని.. ఆ తర్వాత తామంతా కలిసి కూర్చొని భోజనం కూడా చేశామని, తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చిరంజీవి గారికి క్లారిటీ ఇచ్చామని జానీ మాస్టర్ తెలిపారు.

ఇదే వేదికపై జానీ మాస్టర్ తన ఉదారతను చాటుకున్నారు. అసోసియేషన్‌లోని డ్యాన్సర్ల హెల్త్ ఇన్సూరెన్స్ కోసం మొత్తం 58 లక్షల రూపాయలు అవసరం కాగా.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే 40 లక్షల రూపాయల భారీ విరాళం అందించారని చెప్పారు. ఇక మిగిలిన 18 లక్షల రూపాయల మొత్తాన్ని.. తాను తాజాగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా పారితోషికం నుండి విరాళంగా ఇస్తున్నట్లు జానీ మాస్టర్ సంచలన ప్రకటన చేశారు.

మరోవైపు అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత మాట్లాడుతూ.. కొందరు సభ్యుల రాజీనామాల వల్ల ఉప ఎన్నికలు నిర్వహించాలా? వద్దా? అనే దానిపైనే సర్వసభ్య సమావేశంలో సీక్రెట్ బ్యాలెట్ నిర్వహించామని చెప్పారు. మెజార్టీ సభ్యులు ఉప ఎన్నికలకే మొగ్గు చూపారని.. ఫెడరేషన్ నిబంధనల ప్రకారమే చట్టబద్ధంగా ముందుకు సాగుతామని, ఇక్కడ ఎలాంటి ఏకపక్ష నిర్ణయాలు జరగలేదని స్పష్టత ఇచ్చారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story