ముంబై : సినీ, టీవీ కళాకారుల హక్కులు, సంక్షేమం కోసం పనిచేస్తున్న సినీ & టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) నాయకత్వం తాజాగా మీడియా ముందుకు వచ్చింది. సంస్థ మాజీ సభ్యుల నుంచి వచ్చిన కొన్ని ప్రకటనలు, ఆరోపణల నేపథ్యంలో CINTAA అధికారిక వైఖరిని వెల్లడించింది. ఇటీవల తెరపైకి వచ్చిన అంశాలపై ఏకపక్ష కథనాలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో పూర్తి వాస్తవాలను ప్రజల ముందుంచేందుకే ఈ మీడియా సమావేశం నిర్వహించినట్లు నాయకత్వం తెలిపింది.

ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో CINTAA అధ్యక్షురాలు పూనమ్ ధిల్లాన్, జనరల్ సెక్రటరీ పద్గినీ కొల్హాపురేతో పాటు జయ భట్టాచార్య, షీబా ఆకాష్‌దీప్ సబీర్, చంద్రప్రకాశ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.

'ఉపాసన సింగ్ ఆరోపణలు పూర్తిగా నిరాధారం'

ఇటీవల నటి ఉపాసన సింగ్ చేసిన ఆరోపణలపై పూనమ్ ధిల్లాన్ తీవ్రంగా స్పందించారు. ఆమె ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, వాస్తవాలకు విరుద్ధమని స్పష్టం చేశారు.

సంస్థ కోసం సమీకరించే ప్రతి రూపాయికి పూర్తి లెక్కలు ఉన్నాయని పూనమ్ ధిల్లాన్ తెలిపారు. విరాళాలు, నిధులు ఏ ఉద్దేశంతో సమీకరించబడతాయో.. అదే ఉద్దేశానికి, సంబంధిత లబ్ధిదారులకు చేరుతాయని పేర్కొన్నారు.

'మేము సమీకరించే ప్రతి రూపాయికి పూర్తి లెక్కలు ఉంటాయి. ఒక్క రూపాయి కూడా వ్యక్తిగత ప్రయోజనం కోసం ఉపయోగించలేదు. చట్టవిరుద్ధమైన లేదా రాజ్యాంగ విరుద్ధమైన చర్యల విషయంలో మాకు జీరో టాలరెన్స్ ఉంది. మా పని పారదర్శకత, జవాబుదారీతనం, వాస్తవాల ఆధారంగా సాగుతుంది. రికార్డులే అన్నింటికీ సమాధానం చెబుతాయి' అని పూనమ్ ధిల్లాన్ పేర్కొన్నారు.

'నిధులు వ్యక్తిగత అవసరాలకు మళ్లించలేదు'

జనరల్ సెక్రటరీ పద్గినీ కొల్హాపురే కూడా ఆరోపణలను ఖండించారు. సంస్థ సేకరించే నిధులను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నామని, అవి ఏ ప్రయోజనం కోసం సేకరించబడతాయో ఆ ప్రయోజనానికే వినియోగిస్తామని తెలిపారు.

'ఉపాసన సింగ్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, ఆధారరహితం. మేము సేకరించే నిధులు అత్యంత బాధ్యతతో నిర్వహించబడతాయి. అవి ఏ వ్యక్తులు, ఏ కార్యక్రమాల కోసం ఉద్దేశించబడతాయో వారికి, వాటికే చేరుతాయి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎప్పుడూ మళ్లించలేదు. చట్టవిరుద్ధమైన లేదా రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు మేము ఎప్పుడూ వ్యతిరేకమే' అని పద్గినీ కొల్హాపురే అన్నారు.

కళాకారుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం

మీడియా సమావేశంలో CINTAA నాయకత్వం సంస్థ భవిష్యత్ ప్రాధాన్యతలను కూడా స్పష్టం చేసింది. కళాకారుల హక్కులు, ప్రయోజనాలను కాపాడటంతో పాటు వారి సంక్షేమం, గౌరవాన్ని పరిరక్షించడమే తమ ప్రధాన లక్ష్యమని వెల్లడించింది.

దశాబ్దాలుగా CINTAAకు ఉన్న ప్రతిష్ట, వారసత్వాన్ని ఎంపిక చేసిన ఆరోపణలు లేదా ఊహాగానాలతో నిర్వచించకూడదని నాయకత్వం పేర్కొంది. సంస్థ కార్యకలాపాల్లో పారదర్శకత, జవాబుదారీతనం, కళాకారుల సంక్షేమం కీలకంగా ఉంటాయని స్పష్టం చేసింది.

'రికార్డులే వాస్తవాలకు సాక్ష్యం'

ఇటీవల CINTAAపై బహిరంగంగా వినిపిస్తున్న ఆరోపణలు, ఆందోళనలకు సమాధానం ఇవ్వడంతో పాటు సంస్థ అధికారిక వైఖరిని రికార్డులో ఉంచేందుకే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు నాయకత్వం తెలిపింది.

CINTAA విశ్వసనీయత, గౌరవం, దశాబ్దాల వారసత్వాన్ని కాపాడుకుంటూనే.. కళాకారుల హక్కులు, ప్రయోజనాల కోసం పనిచేస్తామని పూనమ్ ధిల్లాన్, పద్గినీ కొల్హాపురే స్పష్టం చేశారు.

Lipika Varma

Lipika Varma

Next Story