Rajesh Sharma: బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మ ఆరోగ్య పరిస్థితిపై గతంలో వచ్చిన వార్తలపై తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. జూలైలో హైదరాబాద్‌లో షూటింగ్ సమయంలో రాజేష్ శర్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నప్పుడు ఆయనను ఏదో పురుగు కుట్టిందని వార్తలు వచ్చాయి.

ఈ వార్తలు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి. ‘ఫౌజీ’ సినిమా టీమ్ షూటింగ్ సమయంలో నటీనటుల భద్రత విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదా? అనే ప్రశ్నలు కూడా వచ్చాయి. మరికొందరు రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ ప్రాంతంలో పరిశుభ్రత, భద్రత సరిగా లేదంటూ విమర్శలు చేశారు.

అయితే తాజాగా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజేష్ శర్మ ఈ వార్తలను ఖండించారు. ‘ఫౌజీ’ సినిమా సెట్స్‌లో తనకు ఎలాంటి సమస్య రాలేదని ఆయన స్పష్టం చేశారు. తన ఆరోగ్య పరిస్థితికి సినిమా టీమ్‌కు గానీ, రామోజీ ఫిల్మ్ సిటీకి గానీ ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

తన కుడి కాలికి చాలా కాలంగా చర్మ సమస్య ఉందని రాజేష్ శర్మ వెల్లడించారు. అదే సమయంలో తన రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా ఉండటంతో ఆ సమస్య మరింత తీవ్రమైందని తెలిపారు. షూటింగ్ తర్వాత కోల్‌కతాకు తిరిగి వెళ్లినప్పుడు పరిస్థితి మరింత విషమించడంతో చివరకు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని వివరించారు.

తనను పురుగు కుట్టిందన్న వార్తలు కూడా పూర్తిగా అవాస్తవమని రాజేష్ శర్మ స్పష్టం చేశారు. ప్రభాస్‌తో పాటు ‘ఫౌజీ’ సినిమా మొత్తం టీమ్ చాలా మంచి వాళ్లని ఆయన చెప్పారు. తనకు జరిగిన ఆరోగ్య సమస్యకు వారిని బాధ్యులుగా చేయడం సరైంది కాదని అన్నారు.

ప్రస్తుతం రాజేష్ శర్మ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. చికిత్స పూర్తయిందని, ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడుతోందని చెప్పారు. త్వరలోనే మళ్లీ షూటింగ్స్‌లో పాల్గొనాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Next Story