Legendary Director Bharathiraja: దిగ్గజ దర్శకుడు భారతీరాజాకు నివాళులర్పించిన సీఎం విజయ్
భారతీరాజాకు నివాళులర్పించిన సీఎం విజయ్

Legendary Director Bharathiraja: తమిళ చిత్రసీమలో ఒక శకం ముగిసింది. తన విలక్షణమైన దర్శకత్వంతో భారతీయ సినిమా రంగాన్ని మలుపు తిప్పిన దిగ్గజ దర్శకుడు భారతీరాజా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, నేడు తుదిశ్వాస విడిచారు. భారతీరాజా మరణవార్త విన్న సినీ లోకం దిగ్భ్రాంతికి లోనైంది.
ప్రస్తుతం అభిమానుల, ప్రముఖుల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని చెన్నైలోని ఆయన నివాసంలో ఉంచారు. భారతీరాజా భౌతికకాయాన్ని దర్శించుకునేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా తరలివస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్... భారతీరాజా నివాసానికి చేరుకొని ఆయన పార్థివదేహానికి ఘన నివాళులర్పించారు.
భారతీరాజా కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం విజయ్, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భారతీరాజా మృతి కేవలం తమిళ సినిమాకే కాదు... మొత్తం భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటని ఆయన సంతాపం వ్యక్తం చేశారు.
మరోవైపు డీఎంకే అధినేత స్టాలిన్, ప్రముఖ సీనియర్ నటి రాధిక కూడా భారతీరాజా నివాసానికి చేరుకొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారతీరాజాతో తనకున్న పాత అనుబంధాన్ని స్టాలిన్ గుర్తుచేసుకున్నారు. తమిళ సినిమా పంథాను మార్చి, సరికొత్త ధోరణిని సృష్టించిన గొప్ప కళాకారుడు భారతీరాజా అని ఆయన కొనియాడారు.
అప్పట్లో కేవలం నాలుగు గోడల స్టూడియోలకే పరిమితమైన కెమెరాలను... ధైర్యంగా గ్రామాల్లోకి తీసుకెళ్లి, పల్లెటూరి ప్రజల యథార్థ జీవితాలను వెండితెరపై ఆవిష్కరించిన ఘనత భారతీరాజాదేనని స్టాలిన్ అన్నారు. తమిళ సినిమాను వాస్తవికతకు అద్దం పట్టేలా చేసిన ఆయన చిత్రాలు... భారతీయ చలనచిత్ర చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయని, రాబోయే ఎన్నో తరాలకు ఆయన ఒక స్ఫూర్తి అని గుర్తుచేసుకున్నారు.

