Betting App Premotions : బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో విచారణకు రండి
నలుగురు సినీ తారలకు ఈడీ నోటీసులు

అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు పెయిడ్ ప్రమోషన్ చేసిన కేసులో ఈడీ దూకుడు పెంచింది. బెట్టింగ్ యాప్ లకు ప్రచారం చేసిన సినీ సెలబ్రెటీలు పలువురిని విచారణకు రావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈడీ నుంచి నోటీసులు అందుకున్న వారిలో హీరోలు దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, నటులు ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మీలు ఉన్నారు. వీరందరినీ వేరు వేరు రోజుల్లో విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. బుధవారం అంటే జూలై 23వ తేదీన దగ్గుబాటి రానాను విచారణకు రావాల్సిందిగా ఈడీ సమన్లు ఇచ్చింది. అలాగే జూలై 30వ తేదీ ప్రకాష్ రాజ్, ఆగస్టు 6వ తేదీన విజయ్ దేవరకొండ, ఆగస్టు 13వ తేదీన మంచు లక్ష్మిలు విచారణకు హాజరు కావాలని ఈడీ పేర్కొంది. బెట్టింగ్ యాప్ లకు ప్రమోషన్ చేయడానికి ఆయా సంస్ధలతో చేసుకున్న ఒప్పందాలు, తీసుకున్న రెమ్యునరేషన్లు, వాటికి సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, సంబంధిత డాక్యుమెంట్లను తీసుకుని హైదరాబాద్ లోని ఈడీ జోనల్ కార్యాలయంలో హాజరు కావాలని ఈ నలుగురు సినీ సెలబ్రెటీలకు ఈడీ సమన్లు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేరు వేరు పోలీస్ స్టేషన్లలో నమోదైన ఎఫ్‌ఐఆర్ ల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈసీఐఆర్ రిజిస్టర్ చేసింది. పలు ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లకు ప్రచార కర్తలుగా పనిచేసిన సినీ నటులు, టీవీ యాక్టర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్షర్లు అందరూ కలిపి మొత్తం 29 మందిపై ఈడీ కేసులు నమోదు చేసింది. వీరిలో తొలి విడతగా నలుగురు సినీ నటులను జూలై 23 నుంచి విచారణకు పిలిచింది.
