Nagarjuna: కొత్త కథలతో సినీ పరిశ్రమలోకి రావాలనుకునే నవతరం ప్రతిభావంతులకు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సూపర్ ఆఫర్ ప్రకటించారు. సరికొత్త కాన్సెప్ట్‌లతో వచ్చే కొత్తవారికి అవకాశాలు ఇచ్చి సినిమాలు నిర్మించేందుకు తమ అన్నపూర్ణ స్టూడియోస్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన వెల్లడించారు. పళ్ల బురుసు సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కథ ఉంటే నేరుగా కలవండి

స్టూడియోల నిర్వహణ, సినీ రంగానికి తిరిగి ఇచ్చే సేవ గురించి నాగార్జున స్పందిస్తూ.. "స్టూడియో అంటే కేవలం లీజుకు ఇచ్చి డబ్బులు సంపాదించడం మాత్రమే కాదు. చిత్ర పరిశ్రమకు తిరిగి ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ సినిమాలు నిర్మిస్తున్నాం. మంచి కథ ఉంటే ఎవరైనా సరే నేరుగా అన్నపూర్ణ స్టూడియోస్‌ను సంప్రదించవచ్చు" అని పిలుపునిచ్చారు.

నాగార్జున 100వ చిత్రం..

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో వస్తున్న చిత్రాల గురించి వివరిస్తూ.. ఇటీవల లెనిన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నామని, ఇప్పుడు పళ్ల బురుసు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నామని చెప్పారు. నాగార్జున ప్రతిష్ఠాత్మక 100వ మైలురాయి చిత్రం కింగ్ 100 కూడా అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించనుండటం విశేషం.

ఆగస్టు 14న పళ్ల బురుసు విడుదల..

ఉదయ్ చౌహన్ దర్శకత్వంలో తెరకెక్కిన పళ్ల బురుసు చిత్రంలో గోమతి రెడ్డి, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story