కస్టమ్స్‌ సోదాల కలకలం

Customs Raids: మలయాళ నటులు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, దుల్కర్‌ సల్మాన్‌ నివాసాల్లో మంగళవారం కస్టమ్స్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. లగ్జరీ కార్ల స్మగ్లింగ్‌ ఆరోపణలకు సంబంధించి నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు జరిగాయి. ‘ఆపరేషన్‌ నమకూర్‌’ పేరుతో దేశవ్యాప్తంగా పలు నివాసాల్లో కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కోచి, తిరువనంతపురంలోని పృథ్వీరాజ్‌ నివాసాలతో పాటు, పనంపిల్లి నగర్‌లోని దుల్కర్‌ సల్మాన్‌ ఇంటిలోనూ సోదాలు నిర్వహించారు. అయితే, వీరి వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి లగ్జరీ వాహనాలు గుర్తించలేదని సమాచారం. ఈ సోదాలు కేవలం వీరిపైనే కాకుండా, కేరళలోని కోచి, కోలికోడ్‌, మలప్పురం వంటి వివిధ ప్రాంతాల్లో కూడా జరిగాయి.

ఇంటెలిజెన్స్‌ వర్గాల నివేదికల ప్రకారం, భూటాన్‌ ఆర్మీ తన వాహనశ్రేణిలోని కొన్ని ఖరీదైన వాహనాలను ఉపసంహరించుకుంది. ఈ వాహనాలను కొందరు ఏజెంట్లు వేలంలో తక్కువ ధరకు కొనుగోలు చేశారు. కస్టమ్స్‌ డ్యూటీ చెల్లించకుండా వాటిని భారత్‌కు స్మగ్లింగ్‌ చేసినట్లు తెలిసింది. ఈ ఖరీదైన వాహనాలను హిమాచల్‌ ప్రదేశ్‌ మీదుగా భారత్‌లోని కొన్ని తాత్కాలిక చిరునామాలకు తరలించారు. సినీ, వ్యాపార వర్గాలతో సహా కొందరు విశ్వసనీయ కొనుగోలుదారులకు మాత్రమే ఈ వాహనాలను విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇండియా-భూటాన్‌ ట్రేడ్‌ నిబంధనలలోని లొసుగులను ఉపయోగించుకొని ఈ స్మగ్లింగ్‌ జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల భూటాన్‌ నుంచి వచ్చిన వాహనాలకు సంబంధించిన రసీదులు, ఇతర ఆధారాలను కస్టమ్స్‌ అధికారులు పరిశీలిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story