Director Teja’s Son: దర్శకుడు తేజ కుమారుడిని మోసం చేసిన సైబర్ నేరగాళ్లు
మోసం చేసిన సైబర్ నేరగాళ్లు

Director Teja’s Son: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తేజ కుమారుడు అమితవ్ తేజ ఆన్‌లైన్ మోసగాళ్ల ఉచ్చులో పడి భారీగా నష్టపోయారు. స్టాక్ మార్కెట్, ట్రేడింగ్‌లో అధిక లాభాలు వస్తాయన్న మాటలు నమ్మి ఆయన ఏకంగా రూ. 63 లక్షలు పోగొట్టుకున్నారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నమ్మించి ముంచిన దంపతులు: పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ మోతీనగర్‌కు చెందిన యార్లగడ్డ అనూష, కొండపనేని ప్రణీత్ అనే దంపతులతో అమితవ్ తేజకు 2025 ఏప్రిల్‌లో పరిచయం ఏర్పడింది. తాము ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో నిపుణులమని, తమ ద్వారా పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే కోట్లు సంపాదించవచ్చని వారు అమితవ్‌ను నమ్మబలికారు. ఒకవేళ నష్టాలు వస్తే, తమ ఫ్లాట్‌ను గ్యారెంటీగా ఇస్తామని నమ్మకం కలిగించారు.
నకిలీ పత్రాలతో మాయాజాలం: వారి మాటలు నమ్మిన అమితవ్ పలు విడతలుగా లక్షలాది రూపాయలు బదిలీ చేశారు. ఇన్వెస్ట్ చేసిన వారం రోజుల్లోనే రూ. 9 లక్షల లాభం వచ్చిందంటూ నిందితులు కొన్ని నకిలీ పత్రాలను సృష్టించి ఆయనకు చూపించారు. ఇది నిజమని నమ్మిన అమితవ్, మరింత భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టారు. మొత్తం రూ. 63 లక్షల వరకు వసూలు చేసిన తర్వాత నిందితులు అసలు రంగు బయటపెట్టారు.
ఫోన్లు స్విచ్ఛాఫ్.. దంపతులు పరార్: పెట్టిన పెట్టుబడి, లాభాల గురించి అమితవ్ ప్రశ్నించగా నిందితులు కాలయాపన చేస్తూ వచ్చారు. చివరకు తమ ఫోన్ నంబర్లు మార్చేసి పరారయ్యారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన అమితవ్ తేజ, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులపై చీటింగ్, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసిన పోలీసులు, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ప్రస్తుతం వ్యాపార రంగంలో ఉన్న అమితవ్ తేజ, త్వరలోనే తన తండ్రి తేజ దర్శకత్వంలో హీరోగా తెలుగు వెండితెరపై అరంగేట్రం చేయాల్సి ఉండగా, ఈ లోపే ఇలాంటి చేదు అనుభవం ఎదురవ్వడం చర్చనీయాంశంగా మారింది.

