Nagabandham: నాగబంధంలో డూప్ లేకుండా డేంజరస్ యాక్షన్ సీన్స్..మేకప్ కే 6 గంటలు
మేకప్ కే 6 గంటలు

Nagabandham: తొలి సినిమా ‘పెదకాపు’తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో విరాట్ కర్ణ.. ఇప్పుడు తన రెండో సినిమాగా భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అభిషేక్ నామా దర్శకత్వంలో.. కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ విజువల్ వండర్ జులై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హీరో విరాట్ కర్ణ తన సినిమా ముచ్చట్లు పంచుకున్నాడు.
ఈ సినిమాలో విరాట్.. ‘రుద్ర’, ‘నాగసాధు’ అనే రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. కథ వినగానే ఇది తన కోసమే రాసినట్టు అనిపించిందన్న విరాట్.. ఈ పాత్రల కోసం ప్రాణం పెట్టి పనిచేశాడు. రుద్ర క్యారెక్టర్ కోసం ఏకంగా 20 కిలోల బరువు పెరిగి, ఆ తర్వాత నాగసాధువు పాత్ర కోసం మళ్లీ 5 కిలోలు తగ్గాడు. ఇక నాగసాధువు మేకప్ కోసమే ప్రతిరోజూ ఏకంగా 6 గంటల సమయం పట్టేదట.
సినిమా కోసం డూప్‌ను అస్సలు వాడకుండా.. ప్రతి యాక్షన్ సీన్‌ను విరాట్ స్వయంగా చేశాడు. తీవ్రమైన చలికాలంలో ఒంటిపై బట్టలు లేకుండా ఒక భారీ ఫైట్ సీన్ చేస్తున్నప్పుడు విరాట్ శరీరం పూర్తిగా ఫ్రీజ్ అయిపోయి హాస్పిటల్ పాలయ్యాడట. అయినా సరే, మరుసటి రోజే మళ్లీ షూటింగ్‌కు హాజరై తన డెడికేషన్‌ను చాటుకున్నాడు.
భారీ సెట్స్, వందల మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య మొదట్లో కొంచెం భయపడినా.. దర్శకుడు అభిషేక్ నామా ఇచ్చిన ధైర్యంతో అద్భుతంగా నటించానని విరాట్ తెలిపాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో భక్తితో ప్రతిరోజూ శివాలయానికి వెళ్లి అభిషేకం చేసేవాడినని, షూటింగ్ పూర్తయ్యాక శివమాల కూడా ధరించానని చెప్పుకొచ్చాడు.
రెండో సినిమాకే ఇలాంటి భారీ బడ్జెట్ డివైన్ అడ్వెంచర్ థ్రిల్లర్ చేయడం తన అదృష్టమంటున్న విరాట్.. త్వరలోనే తన నెక్స్ట్ రెండు సినిమాలను అనౌన్స్ చేయబోతున్నాడు. మరి జులై 3న రాబోతున్న ఈ 'నాగబంధం' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

