Dhurandhar 2 : ధురంధర్-2 బాక్సాఫీస్ సునామీ!..రూ.800 కోట్ల దాటిన కలెక్షన్లు
రూ.800 కోట్ల దాటిన కలెక్షన్లు

Dhurandhar 2 : బాక్సాఫీస్ వద్ద కేవలం కలెక్షన్ల వర్షం కాదు.. ఒక అన్-స్టాపబుల్ దండయాత్ర! రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ అద్భుత సృష్టి 'ధురంధర్-2' ఇప్పుడు ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాస్తోంది. రికార్డుల వేటలో ఈ సినిమా వేగానికి హద్దుల్లేకుండా పోతున్నాయి!.ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో ధురంధర్ సృష్టిస్తున్న విధ్వంసం మామూలుగా లేదు. కేవలం నాలుగే నాలుగు రోజుల్లో హిందీ వెర్షన్ ఏకంగా 430 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. అంతకుముందు 'పుష్ప-2' హిందీ వెర్షన్ సాధించిన 425 కోట్ల రికార్డును మట్టికరిపించి.. హిందీ మార్కెట్‌లో తన సత్తా ఏంటో చాటిచెప్పింది!
ఇక ఐదు రోజుల ప్రయాణం ముగిసేసరికి.. దేశవ్యాప్తంగా ఈ మూవీ గ్రాస్ కలెక్షన్లు 619 కోట్ల మార్కును దాటేశాయి. కేవలం ఇండియాలోనే కాదు, ఓవర్సీస్‌లోనూ ధురంధర్ మేనియా ఊహకందని స్థాయిలో ఉంది. Sacnilk అధికారిక గణాంకాల ప్రకారం.. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే 829.76 కోట్ల రూపాయల భారీ గ్రాస్‌ను వసూలు చేసి 1000 కోట్ల క్లబ్ వైపు శరవేగంగా దూసుకెళ్తోంది!
అటు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాపై ప్రశంసలు.. ఇటు ప్రేక్షకుల నీరాజనాలు.. వెరసి 'ధురంధర్-2' ఇండియన్ సినిమా గర్వించదగ్గ మైలురాయిగా నిలిచింది. రికార్డులు బద్ధలు కావడానికే అని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరోసారి నిరూపిస్తోంది. చూస్తుంటే ఈ దండయాత్ర ఇప్పట్లో ఆగేలా లేదు!

