Koratala Siva’s Team: నందమూరి బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ NBK 112 చుట్టూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ముఖ్యంగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరనే విషయంలో వస్తున్న వార్తలపై చిత్ర బృందం స్పందించి క్లారిటీ ఇచ్చింది.

పూజతో మొదలైన భారీ ప్రాజెక్ట్.. అంతలోనే రూమర్ల జోరు..

ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. బాలయ్య మాస్ ఇమేజ్, కొరటాల శివ మార్క్ సోషల్ డ్రామా కలయికలో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో సోషల్ మీడియాలో పలు పుకార్లు షికారు చేశాయి.

అనిరుధ్ ఔట్.. జీవీ ప్రకాశ్ ఇన్ అంటూ ప్రచారం

ప్రారంభంలో ఈ ప్రాజెక్ట్‌కు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నట్లు జోరుగా వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఆయన ఇతర సినిమాలతో విపరీతమైన బిజీ షెడ్యూల్ వల్ల ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని, ఆయన స్థానంలోకి తమిళ యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ వచ్చారంటూ వరుస కథనాలు హల్‌చల్ చేశాయి. దీంతో నందమూరి అభిమానుల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది.

అధికారికంగా ఎవరినీ ఖరారు చేయలేదు: మేకర్స్ ప్రకటన

ఈ ప్రచారానికి బ్రేక్ వేస్తూ కొరటాల శివ బృందం ఎక్స్ వేదికగా స్పష్టతనిచ్చింది. "సినిమా సంగీత దర్శకుడికి సంబంధించి ఇంకా చర్చలు మాత్రమే జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఎవరినీ అధికారికంగా ఫైనల్ చేయలేదు. సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక వార్తలను, వదంతులను ఎవరూ నమ్మవద్దు" అని స్పష్టం చేసింది. త్వరలోనే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story