Director Deva Katta: వారణాసి సినిమాపై వస్తున్న వార్తలను ఖండించిన దర్శకుడు దేవా కట్టా
దర్శకుడు దేవా కట్టా

Director Deva Katta: దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న "వారణాసి" సినిమాలో ఒక ముఖ్యమైన భాగాన్ని తాను డైరెక్ట్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ప్రముఖ దర్శకుడు దేవా కట్టా ఘాటూగా ఖండించారు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
"ప్రస్థానం" వంటి వైవిధ్యమైన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దేవా కట్టాకు, రాజమౌళితో ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉంది. గతంలో సూపర్ హిట్ సిరీస్ "బాహుబలి" సినిమాలకు ఆయన డైలాగ్ రైటర్‌గా కూడా పనిచేశారు. ఈ క్రమంలోనే, రాజమౌళి తన కొత్త సినిమా "వారణాసి" కోసం దేవా కట్టాను డైలాగ్స్ రాయడానికి పిలిచారని, అంతేకాకుండా అందులోని ఒక కీలకమైన సీన్‌ను డైరెక్ట్ చేసే బాధ్యతను కూడా ఆయనకే అప్పగించారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, కొన్ని వెబ్‌సైట్లలో జోరుగా ప్రచారం సాగింది.
ఈ వార్తలు నెట్టింట బాగా వైరల్ అవ్వడంతో దేవా కట్టా స్వయంగా స్పందించి వీటికి చెక్ పెట్టారు. కేవలం క్లిక్స్ కోసం, వ్యూస్ కోసం కొందరు తప్పుడు ఉద్దేశంతో ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను ప్రస్తుతం వేరే ఏ సినిమాకు సంబంధించి ఒక్క షాట్ కూడా డైరెక్ట్ చేయడం లేదని తేల్చి చెప్పారు. తన సమయాన్నంతా ప్రస్తుతం తన తదుపరి సినిమా కథను రాయడానికి, దానిని సిద్ధం చేయడానికి మాత్రమే కేటాయిస్తున్నానని, ఈ కొత్త ప్రయాణంపై తనకు ఎంతో ఆసక్తిగా ఉందని ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే తన మనసుకు నచ్చిన, కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను సరైన సమయంలో పంచుకుంటానని తెలిపారు.
దేవా కట్టా ఇచ్చిన ఈ అధికారిక ప్రకటనతో ఈ పుకార్లకు పూర్తిగా తెరపడినట్లయింది. ఆయన ప్రస్తుతం వేరే సినిమాలపై కాకుండా పూర్తిగా తన సొంత డైరెక్షన్ ప్రాజెక్టుపైనే దృష్టి పెట్టారని స్పష్టమైంది. ఇదిలా ఉండగా, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో రాజమౌళి రూపొందిస్తున్న ఈ గ్లోబ్-ట్రాటింగ్ అడ్వెంచర్ సినిమా "వారణాసి" ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

