Kajal Aggarwal: రీల్స్ చూసి నిజ జీవితాలను పోల్చుకోవద్దు.. పెళ్లిళ్లు, విడాకులపై సోషల్ మీడియా ప్రభావంపై కాజల్..
సోషల్ మీడియా ప్రభావంపై కాజల్..

Kajal Aggarwal: సమాజంలో ఆధునిక సంబంధాలు, విడాకుల సంఖ్య పెరుగుతుండటంపై ప్రస్తుతం విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నేటి తరం ప్రేమ, పెళ్లి బంధాలు బీటలు వారడానికి సోషల్ మీడియా ఒక ప్రధాన కారణంగా మారుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. స్క్రీన్‌పై కనిపించే అందమైన దృశ్యాలతో వాస్తవ జీవితాన్ని పోల్చి చూసుకోవడం వల్లే వైవాహిక జీవితాల్లో అనవసర ఒత్తిళ్లు పెరుగుతున్నాయని ఆమె హెచ్చరించారు.
రీల్ జీవితం వేరు.. రియల్ లైఫ్ వేరు..
సోషల్ మీడియాలో కనిపించే ప్రతి అంశం నిజ జీవితానికి ప్రతిబింబం కాదని కాజల్ స్పష్టం చేశారు. ఇంటర్నెట్‌లో దంపతులు తమ సంతోషకరమైన క్షణాలు, ఆకర్షణీయమైన ఫొటోలను మాత్రమే పంచుకుంటారు తప్ప, ప్రతి బంధంలో ఉండే గొడవలు, సమస్యలను బయటకు చూపించరని గుర్తుచేశారు. ఇతరుల కృత్రిమ ఆనందాన్ని చూసి తమ భాగస్వామితో, తమ సంసారంతో పోల్చుకోవడం మొదలుపెట్టినప్పుడే అసంతృప్తి మొదలై దాంపత్యంలో కలతలు రేగుతాయని ఆమె విశ్లేషించారు.
సెలబ్రిటీలపై నిరంతర నిఘా.. మహిళలపై మరింత ప్రభావం
ముఖ్యంగా ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై సామాజిక మాధ్యమాల్లో నిరంతరం విపరీతమైన నిఘా ఉంటోందని కాజల్ ఆవేదన వ్యక్తం చేశారు. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై వచ్చే ట్రోలింగ్స్, కామెంట్లు మరియు విమర్శలు వారి బంధాలపై తీవ్రమైన మానసిక భారాన్ని మోపుతున్నాయని తెలిపారు. ఈ తరహా సోషల్ మీడియా ఒత్తిడి, విమర్శల ప్రభావం పురుషుల కంటే మహిళలపైనే ఎక్కువగా పడుతుందని ఆమె గతంలోనూ కుండబద్దలు కొట్టారు.
జీవితంలో సంతోషానికి అదే ఏకైక మూలం కాదు
గతంలోనూ వివాహ బంధాలపై తన అభిప్రాయాలను వెల్లడించిన కాజల్.. ఒక వ్యక్తి పూర్తి సంతోషం అనేది కేవలం ప్రేమ లేదా పెళ్లి అనే ఒక్క అంశంపైనే ఆధారపడి ఉండకూడదని స్పష్టం చేశారు. భర్త గౌతమ్ కిచ్లుతో తన వైవాహిక బంధం దృఢంగా ఉండటానికి పరస్పర అవగాహనే కారణమని పలు సందర్భాల్లో ఆమె ప్రస్తావించారు. మారుతున్న ఆధునిక జీవనశైలి, సోషల్ మీడియా సృష్టిస్తున్న మితిమీరిన అంచనాలే నేటి తరం పెళ్లిళ్లను బలహీనపరుస్తున్నాయని కాజల్ చేసిన ఈ వ్యాఖ్యలు సమకాలీన యువతను ఆలోచింపజేసేలా ఉన్నాయి.

