శివాజీ వ్యాఖ్యలపై నిధి అగర్వాల్ రియాక్షన్ ఇదే

Nidhhi Agerwal Reacts to Shivaji’s Remarks: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల బట్టల విషయంలో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. తాజాగా ఈ వ్యవహారంపై నటి నిధి అగర్వాల్ పరోక్షంగా స్పందిస్తూ శివాజీకి చురకలంటించారు. ఇటీవల దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ మాట్లాడుతూ.. హీరోయిన్లు ఫంక్షన్లకు వచ్చేటప్పుడు పద్ధతిగా దుస్తులు ధరించాలని సూచించారు. అభ్యంతరకరంగా బట్టలు వేసుకోవడం వల్లే అభిమానులు అతిగా ప్రవర్తిస్తున్నారని, అసభ్యకరంగా కనిపించే దుస్తులు వేసుకోవడం దరిద్రం అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు కూడా అందం చీరకట్టులోనే ఉంటుంది అని చెబుతూ ఆయన చేసిన కొన్ని కామెంట్స్ వివాదాస్పదమవ్వడంతో ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. ఇటీవల రాజాసాబ్ ఈవెంట్‌లో నిధి అగర్వాల్‌కు, అలాగే మరో సందర్భంలో సమంతకు అభిమానుల నుండి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ ఘటనలను దృష్టిలో పెట్టుకునే శివాజీ ఈ సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అయితే తప్పు చేసిన వారిని వదిలేసి, బాధితుల వస్త్రధారణను తప్పుపట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నిధి అగర్వాల్ రియాక్ట్

శివాజీ వ్యాఖ్యలపై నిధి అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నేరుగా పేరు ఎత్తకపోయినా ఆయన మాటలను ఉద్దేశిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు. "వేధింపులకు గురైన బాధితులను తప్పుపట్టడం సరైన పద్ధతి కాదు. ఇటువంటి కామెంట్స్ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తాయి" అని ఆమె అన్నారు. దుస్తుల వల్లే వేధింపులు జరుగుతాయని చెప్పడం విక్టిమ్ బ్లేమింగ్ కిందకు వస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఒకవైపు శివాజీ తన ఉద్దేశం మంచిదే అని వాదిస్తున్నా, నిధి అగర్వాల్ వంటి హీరోయిన్లు మాత్రం అది వ్యక్తిగత స్వేచ్ఛపై దాడి అని, వేధింపులకు బట్టలను సాకుగా చూపకూడదని స్పష్టం చేస్తున్నారు. ఈ వివాదంపై శివాజీ మళ్ళీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story