Drishyam 3: మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం 3 థియేటర్లలో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. థియేట్రికల్ రన్‌లో సంచలనాలు సృష్టించిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రైమ్ వీడియోలో జూన్ 18 నుండి స్ట్రీమింగ్ కానుంది. మే 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, నెల రోజులు కూడా కాకముందే ఓటీటీ బాట పట్టడం విశేషం. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ సినిమాస్ నుండి భారీ ధరకే ప్రైమ్ వీడియో ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది.

నాలుగు భాషల్లో ఒకేసారి విడుదల

ఈ చిత్రం కేవలం మలయాళంలోనే కాకుండా.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా ఒకేసారి అందుబాటులోకి రానుంది. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాల్లో జూన్ 18 నుండి ఒకేసారి ఈ చిత్రం డిజిటల్‌గా స్ట్రీమ్ కాబోతోంది.

ఈసారి కథలో కొత్త కోణం..

దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ మూడో భాగంలో కథను సరికొత్త కోణంలో ఆవిష్కరించారు. గత రెండు భాగాల లాగా కేవలం వరుస ట్విస్టులపైనే ఆధారపడకుండా.. ప్రధాన పాత్ర అయిన జార్జ్‌కుట్టి ఎదుర్కొనే నైతిక సంఘర్షణలను ఇందులో చూపించారు. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం అతడు ఎంతదూరమైనా వెళ్లే పరిస్థితులను ఎమోషనల్‌గా తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు.

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ

థియేటర్లలో దృశ్యం 3 తిరుగులేని కలెక్షన్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సాధించిన వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి..

భారతదేశం - రూ. 123 కోట్లకు పైగా

ఓవర్సీస్ - రూ. 111.50 కోట్ల గ్రాస్

టోటల్ వరల్డ్ వైడ్ - రూ. 234.97 కోట్లకు పైగా

భారత్‌లోనే రూ. 123 కోట్లకు పైగా వసూలు చేయడం ద్వారా.. అత్యధిక కలెక్షన్లు సాధించిన మలయాళ చిత్రాల జాబితాలో దృశ్యం 3 రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ చిత్రంలో మోహన్‌లాల్‌తో పాటు మీనా, ఎస్తేర్ అనిల్, అన్సిబా హసన్, సిద్ధిఖ్, ఆశా శరత్, మురళీ గోపీ తదితరులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. థియేటర్లలో మిస్ అయిన వారికి జూన్ 18 నుండి ఇంట్లోనే కూర్చుని ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ను ఎంజాయ్ చేసే అవకాశం లభించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story