ధురంధర్ హిట్.. మాకు వాటా ఇవ్వాలంటూ పాక్ ప్రజల వింత డిమాండ్
మాకు వాటా ఇవ్వాలంటూ పాక్ ప్రజల వింత డిమాండ్

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ సినిమా కరాచీలోని ల్యారీ గ్యాంగ్ వార్ల నేపథ్యంలో తెరకెక్కింది. తమ ఊరి కథను ప్రపంచానికి చూపించి కోట్లు సంపాదిస్తున్నారని అందుకే ఆ లాభాల్లో తమకూ భాగం ఉండాలని స్థానికులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ట్విట్టర్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ల్యారీ ప్రజలు సినిమా లాభాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యక్తి ఏకంగా సినిమా లాభాల్లో 80 శాతం తమకే ఇవ్వాలని, దర్శకుడికి అది పెద్ద నష్టం కాదని వాదించాడు.
మరికొందరు 12 కోట్లు, 20 కోట్లు ఇస్తే ఆ డబ్బుతో స్థానికంగా ఆసుపత్రులు కట్టుకుంటామని చెప్పుకొచ్చారు. తమ ప్రాంతాన్ని సినిమాలో వాడినప్పుడు తమకు వాటా ఎందుకు ఇవ్వకూడదని వారు ప్రశ్నించడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అసలు నిజం ఏంటంటే?
ఈ సినిమాలో ల్యారీ ప్రాంతం ఎంతో సహజంగా కనిపించినప్పటికీ, చిత్ర యూనిట్ నిజానికి అక్కడ షూటింగ్ చేయలేదు. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో ల్యారీ ప్రాంతాన్ని తలపించేలా భారీ సెట్స్ నిర్మించారు. 1999 - 2009 మధ్యకాలంలో ల్యారీలో జరిగిన గ్యాంగ్ వార్లను, ఉగ్రవాద నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేందుకు అత్యున్నత నిర్మాణ విలువలను పాటించారు.
డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం రణవీర్ సింగ్‌తో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ వంటి స్టార్ నటుల పెర్ఫార్మెన్స్‌తో బ్లాక్‌బస్టర్ టాక్ సంపాదించుకుంది. ముఖ్యంగా డ్రగ్స్ మాఫియా, పోలీసుల దాడుల నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. తమ ఊరి పేరు వాడుకున్నారని పాకిస్థాన్ వాసులు చేస్తున్న ఈ డిమాండ్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

