బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర (Dharmendra) తరఫున పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ప్రముఖ నటి హేమామాలిని (Hema Malini) భావోద్వేగానికి గురయ్యారు. దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌ను స్వీకరించిన అనంతరం ఆమె తన హృదయానుభూతులను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

“అది ఒక అద్భుతమైన, ఆనందభరితమైన క్షణం. ఆ సమయంలో ధరం జీ నా పక్కనే ఉన్నట్టు, నా చెయ్యి పట్టుకుని వేదికపైకి నడిపించినట్టు అనిపించింది. అక్కడ ఆయన కోసం పద్మ విభూషణ్ అవార్డు ఎదురుచూస్తోంది,” అంటూ హేమామాలిని భావోద్వేగంగా పేర్కొన్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందజేసిన ఆ ప్రశాంతమైన పద్మ అవార్డుల వేడుకలో తాను ధర్మేంద్రకు ప్రాతినిధ్యం వహిస్తూ కూర్చుని ఉండగా ఎంతో గర్వంగా అనిపించిందని ఆమె తెలిపారు.

ధర్మేంద్రతో కలిసి నటిగా చేసిన ఎన్నో హిట్ సినిమాల జ్ఞాపకాలు, అనంతరం జీవిత భాగస్వామిగా గడిపిన సంవత్సరాలు తన మదిలో మెదిలాయని చెప్పారు. ఆ ఆలోచనలతో తన కళ్లలో నీళ్లు తిరిగాయని హేమామాలిని వెల్లడించారు. “ఆయన ప్రేమాభిమానాలు గల భర్త, మమతతో కూడిన తండ్రి, ఆదర్శ తాతయ్య. మంచి మిత్రుడు, నిజమైన తత్వవేత్త, నమ్మకమైన మార్గదర్శి. ధరం జీ ఈ గొప్ప లక్షణాలన్నింటికీ ప్రతిరూపం. ఆయన ఉదార స్వభావం కలిగిన గొప్ప మనిషి. ఆయనను తెలిసిన ప్రతి ఒక్కరూ ప్రేమించారు,” అంటూ తన భర్తను స్మరించుకున్నారు.

ఈ పురస్కారాన్ని తమ కుటుంబ సభ్యులు, కోట్లాది అభిమానులు, శ్రేయోభిలాషుల తరఫున ఎంతో వినయంతో స్వీకరించానని హేమామాలిని తెలిపారు. “నా జీవితానికి అద్భుతమైన ఆత్మసఖుడిని ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు. ఆయనతో గడిపిన జ్ఞాపకాలను నా జీవితాంతం మరిచిపోలేనని ఆమె పేర్కొన్నారు. ధర్మేంద్ర తరఫున దేశంలోని రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్‌ను స్వీకరించిన ఆ క్షణం తనను పూర్తిగా భావోద్వేగానికి గురి చేసిందని హేమామాలిని చెప్పారు.

Updated On
Lipika Varma

Lipika Varma

Next Story