ప్రతాప్ సినిమా, తెలుగు పాన్ ఇండియా మూవీ SYG, తల్లి హేమమాలినితో అనుబంధం, మాతృత్వం, ఫిట్నెస్, ఆధ్యాత్మికతపై ఈషా డియోల్ ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

బాలీవుడ్ సీనియర్ నటి ఈషా డియోల్ ఇటీవల విడుదలైన 'ప్రతాప్' చిత్రంతో ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు అందుకుంటున్నారు. ఒక వైపు వైవిధ్యమైన సినిమాలలో నటిస్తూనే, మరోవైపు పిల్లల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్నారు. తాజాగా ఆమె తన తాజా చిత్రం 'ప్రతాప్', తల్లి హేమమాలిని వారసత్వం, రాబోయే తెలుగు సినిమా, అలాగే నేటి తరం మహిళలకు తానివ్వాలనుకుంటున్న సందేశం గురించి సుదీర్ఘంగా ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
'ప్రతాప్' ఆదరణ & మహిళలకు బలమైన సందేశం
'ప్రతాప్' చిత్రానికి, అందులో నా పాత్రకు వస్తున్న ఆదరణ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఒక నటిగా ప్రేక్షకులు మన పనిని మెచ్చుకోవడం, సినిమాతో కనెక్ట్ అవ్వడం ఎప్పుడూ ప్రత్యేకమైన అనుభూతి. నా జీవితంలోని ఈ దశలో ఇలాంటి పరిణతి గల భార్య, తల్లి పాత్రను పోషించడం నాకు బాగా నచ్చింది. ఇందులో ఒక ఆసక్తికరమైన ప్రయాణం ఉంది. ముఖ్యంగా సినిమా చివరిలో మహిళలు తమ జీవితాలకు అన్వయించుకునేలా ఒక చక్కని అంశం ఉంటుంది. చాలా మంది మహిళలు పెళ్లయ్యాక, పిల్లలు పుట్టాక తమ జీవితాన్ని పూర్తిగా భర్త, పిల్లలు లేదా కుటుంబం చుట్టూనే తిప్పుకుంటూ.. దానికి ముందు తాము ఏమిటో, తమ సొంత గుర్తింపు ఏమిటో మర్చిపోతుంటారు. కానీ ఈ సినిమాలోని పరిస్థితులు నా పాత్రను తిరిగి తన సొంత గుర్తింపును తెలుసుకునేలా చేస్తాయి. ఇది చాలా ముఖ్యమైన సందేశం."
పాన్-ఇండియా తెలుగు సినిమా 'SYG'& కొత్త ప్రాజెక్ట్స్
"ప్రస్తుతం నా చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. అందులో 'SYG' అనే పాన్-ఇండియా తెలుగు సినిమా ఒకటి. ఇందులో సంజు సర్‌తో కలిసి షూటింగ్లో పాల్గొన్నాను. అలాగే 'ఘూంఘట్' అనే హారర్ కామెడీ, 'మాలామాల్ వీక్లీ' చిత్రాలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ వేర్వేరు జానర్లకు చెందినవి కావడంతో పని చేయడం ఎంతో ఉత్సాహంగా ఉంది. నాకు తమిళం వచ్చు కానీ తెలుగు మాట్లాడటం రాదు. దీంతో తెలుగు సినిమా కోసం డైలాగ్స్‌ను నేర్చుకుని, బట్టీ పట్టాల్సి వచ్చింది. సెట్లో ఉన్నవారు నాకు ఎంతో సహాయం చేశారు, అలా ఆ ప్రక్రియను పూర్తి చేశాం. అయితే ఆ తెలుగు సినిమా లేదా దర్శకుడి గురించి ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. చిత్రబృందం ప్రమోషన్స్ ప్రారంభించినప్పుడు సరైన విధంగా మాట్లాడతారు."
ఇక 20 ఏళ్ల వయసులో ఉన్నట్లు పరిగెత్తలేను.. మాతృత్వం
"భిన్నమైన పాత్రలు, జానర్ల మధ్య మారుతూ నటించడం సరదాగా ఉంటుంది. కానీ ఇప్పుడు నేను పని చేసే వేగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. నా 20 ఏళ్ల వయసులో సూట్‌కేసులతో ఒక షూటింగ్ నుండి మరో షూటింగ్‌కు పరిగెత్తినట్లు ఇప్పుడు చేయలేను. నాకు అలాంటి జీవితం ఇప్పుడిక వద్దు. విషయాలను నెమ్మదిగా, ప్రణాళికాబద్ధంగా చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఒక తల్లిని కాబట్టి నాకు ఇతర ప్రాధాన్యతలు కూడా ఉన్నాయి. ప్రతి ప్రాజెక్ట్‌కు తగిన సమయం, శ్రద్ధ ఇస్తూనే నా కుటుంబానికి అందుబాటులో ఉండటానికి ఇష్టపడతాను. ఇక నా పిల్లలు ఇప్పుడు కొంచెం పెద్దవారయ్యారు కాబట్టి విషయాలు కొంచెం సులభమయ్యాయి. కుటుంబంగా అందరం కలిసి మేనేజ్ చేస్తున్నాం. నేను షూటింగ్‌కు వెళ్లినప్పుడు వాళ్లు ఎప్పుడూ నన్ను మిస్ అవుతూనే ఉంటారని నేను అనుకోను (నవ్వుతూ)."
అమ్మ హేమమాలిని వారసత్వం & మారిన సంభాషణలు
"నేను తన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తానని మా అమ్మ (హేమమాలిని) ఎప్పుడూ చాలా నమ్మకంగా చెబుతుంటారు. ఆమె నాపై ఉంచిన ఆ నమ్మకం నాకు ఎంతో ప్రత్యేకం, అందుకు నేను కృతజ్ఞతతో ఉంటాను. మాది చాలా దగ్గరి అనుబంధం ఉన్న కుటుంబం. జీవితంలో మనం ఎదిగేకొద్దీ అనుభవాలే మనల్ని బలవంతులుగా చేస్తాయి. ఈ భూమి అనేది మన ఆత్మలు నేర్చుకోవడానికి వచ్చే ఒక పాఠశాల అని, ఇది నిరంతరం మనల్ని పరీక్షిస్తూ మన ఎదుగుదలకు తోడ్పడుతుందని నేను గట్టిగా నమ్ముతాను. నా తల్లిదండ్రులు నాకు బలమైన పునాది వేశారు, ఆ విలువలను ఎప్పుడూ నాతోనే ఉంచుకుంటాను. అయితే ఇప్పుడు అమ్మతో నా సంభాషణలు మారాయి. గతంలోలా డైనింగ్ టేబుల్ వద్ద సినిమాల గురించి, పని గురించి చర్చించుకోవడం లేదు. ఇప్పుడు ఇంట్లో ఏదైనా రిపేర్ చేయించాలా, ఏదైనా సమస్య పరిష్కరించాలా అనే రోజువారీ విషయాల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం (నవ్వుతూ). ఇక అమ్మతో కలిసి తల్లీకూతుళ్లుగా సినిమాలో నటించాలని నాకూ ఉంది, అభిమానులూ కోరుకుంటారు. కానీ ఆమె తన పనుల్లో చాలా బిజీగా ఉన్నారు, బిజీగా ఉండటం మంచిదే. కుదిరినప్పుడు భవిష్యత్తులో తప్పకుండా కలిసి నటిస్తాం, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ విషయంలోనూ అంతే, సందర్భం వచ్చినప్పుడు చేస్తాం."
సోషల్ మీడియా ప్రమోషన్స్, ఫిట్నెస్ & ఆధ్యాత్మికత
"ఈ రోజుల్లో సినిమా ప్రమోషన్స్ మరో స్థాయికి వెళ్లాయి. సోషల్ మీడియా ఇందులో పెద్ద భాగమైంది, తప్పనిసరిగా పాల్గొనాల్సి వస్తోంది. మా రోజుల్లో పరిస్థితులు చాలా ప్రశాంతంగా ఉండేవి, మీడియా పరిధి కూడా తక్కువగా ఉండేది. ఇప్పుడు ప్రతి సినిమా చుట్టూ ఎంతో సందడి జరుగుతోంది. ఇండస్ట్రీలో నిరంతర మార్పు, పురోగతి ఉండాలి, మన ఇండస్ట్రీ అదే చేస్తోంది. సాంకేతికంగా, నటన పరంగా, కథల పరంగా ఎప్పుడూ ఎదుగుతూనే ఉంటుంది. 'ఏక్ దువా' వంటి సామాజిక సందేశం ఉన్న సినిమా చేయడం ఒక కొత్త అనుభవం, అలాంటి కథలు వస్తే తప్పకుండా పరిశీలిస్తాను కానీ ముందుగానే ప్లాన్ చేసుకోను. ఇక నా దినచర్యలో ఫిట్నెస్ చాలా ముఖ్యమైనది. వర్కౌట్, మెడిటేషన్, ఉదయం కాసేపు నా కోసం నేను సమయం (మీ-టైమ్) కేటాయించుకుంటాను. ట్రెడ్‌మిల్‌పై కార్డియో చేసేటప్పుడు పాడ్‌కాస్ట్‌లు వినడం, ప్రశాంతంగా మెడిటేషన్ చేయడం నాకు ఇష్టం. తత్వశాస్త్రం వంటి పుస్తకాలు చదవడానికి ఆసక్తి చూపుతాను. చిన్నప్పటి నుండి సంస్కృత శ్లోకాలు నేర్చుకుంటూ పెరగడం వల్ల ఆధ్యాత్మికత నాలో ఒక భాగమైంది. అది నన్ను నేలపై నిలబడేలా (గ్రౌండెడ్‌గా) ఉంచుతుంది."
అమిత్ సాధ్‌తో కెమిస్ట్రీ & నేటి మహిళలకు సందేశం
"'ప్రతాప్'లో అమిత్ సాధ్‌తో కలిసి పనిచేయడం ఎంతో బాగుంది. ఆయన చాలా క్రమశిక్షణ, వినయం కలిగిన మంచి వ్యక్తి, గొప్ప నటుడు. మా ఇద్దరి మధ్య ఆఫ్-స్క్రీన్ బాండింగ్ బాగుండటం వల్ల తెరపై మా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని అందరూ మెచ్చుకోవడం సంతోషంగా ఉంది. చివరగా 'ప్రతాప్' నుండి ప్రేక్షకులు, ముఖ్యంగా నేటి తరం అమ్మాయిలు, మహిళలు తీసుకెళ్లాల్సిన సందేశం ఒక్కటే.. మీరు ఎవరో ఎప్పుడూ మర్చిపోకండి. కుటుంబం, బంధాలు ముఖ్యమే కానీ వాటిలో మిమ్మల్ని మీరు కోల్పోవద్దు. ఇతరులను గౌరవించడంతో పాటు, మిమ్మల్ని మీరు కూడా గౌరవించుకోండి. ఆ రెండింటి మధ్య సమతుల్యత పాటిస్తూ ఒక వ్యక్తిగా ఎప్పుడూ ఎదుగుతూ ఉండండి" అని ఈషా డియోల్ స్పష్టం చేశారు.

