Euphoria Event: యూఫోరియా ఈవెంట్..కన్నీళ్లు పెట్టుకున్న భూమిక
కన్నీళ్లు పెట్టుకున్న భూమిక

Euphoria Event: 'యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్ ప్రెస్ మీట్‌లో నటి భూమిక చావ్లా చాలా ఎమోషనల్ అయ్యారు. ఆ వేడుకలో ఆమె చేసిన వ్యాఖ్యలు ,స్పందించిన తీరు అందరినీ కదిలించాయి.భూమిక మాట్లాడుతూ..నిన్న రాత్రి నేను ఈ సినిమా చూశాను. చూసిన తర్వాత నాకు అస్సలు నిద్ర పట్టలేదు. రాత్రి 1 గంటకు నిద్రలేచి కూర్చున్నాను. ఆ కథ, అందులోని దృశ్యాలు నన్ను అంతగా వెంటాడాయి," అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, సమాజంలోని నేటి పరిస్థితులకు అద్దం పట్టే ఒక పవర్‌ఫుల్ మెసేజ్ అని ఆమె పేర్కొన్నారు. ఈ చిత్రంలో ఆమె ఒక తల్లి పాత్రలో నటించారు. తన కొడుకు తప్పు చేసినా, బాధితురాలికి న్యాయం జరగాలని కోరుకునే ధైర్యవంతురాలైన తల్లిగా ఆమె నటన అద్భుతంగా ఉందని చిత్ర బృందం ప్రశంసించింది.
తనతో పాటు నటించిన సారా అర్జున్, విఘ్నేష్, లిఖిత వంటి యువ నటీనటుల ప్రతిభను చూసి ఆశ్చర్యపోయానని, వారందరి నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. "సక్సెస్‌ను తలకెక్కించుకోకండి, అలాగే విమర్శలను గుండెకు తీసుకోకండి.. గ్రౌండెడ్‌గా ఉండండి" అని వారికి సూచించారు.
భూమిక ఎమోషనల్ అవ్వడం చూసి దర్శకుడు గుణశేఖర్ స్పందిస్తూ.. "షూటింగ్ సమయంలో కూడా భూమిక ఆ పాత్రలో ఎంతలా లీనమయ్యారంటే, కొన్ని సీన్ల తర్వాత నన్ను కొడతారేమో అనిపించేంత కోపంగా ఉండేవారు. ఆ పాత్రలోని తీవ్రత ఆమెను అలా మార్చేసింది," అని గుర్తు చేసుకున్నారు.

