Movie Ticket Prices: ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన.. సినిమా టికెట్ల రేట్లు పెంచం
సినిమా టికెట్ల రేట్లు పెంచం

Movie Ticket Prices: అద్దె భారంతో కుదేలవుతున్న సింగిల్ స్క్రీన్లను కాపాడుకునేందుకు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పాత పద్ధతులకు స్వస్తి పలికి, కొత్త విధానంలోనే ముందుకు వెళ్లాలని తీర్మానించింది.
మంగళవారం హైదరాబాద్‌లో సమావేశమైన ఎగ్జిబిటర్లు తమ ఆవేదనను వెళ్లగక్కారు. కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయినా, ఇంకా పాత కాలపు 'అద్దె ప్రాతిపదికన' (Rental Basis) సినిమాలను ప్రదర్శించడం వల్ల భారీ నష్టాలు వస్తున్నాయని వారు వాపోయారు. పెద్ద సినిమాలు ఉన్నప్పుడు మినహా, ఏడాదిలో తొమ్మిది నెలల పాటు థియేటర్లు నష్టాల్లోనే నడుస్తున్నాయని, నిర్వహణ భారమై చాలా థియేటర్లు మూతపడుతున్నాయని ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమస్యకు పరిష్కారంగా ఇకపై పూర్తిస్థాయిలో 'పర్సంటేజీ పంపకం' విధానాన్ని అమలు చేయాలని నిర్మాతలు, కథానాయకులను కోరుతున్నారు. అంటే సినిమా వసూళ్లలో వచ్చే లాభాలను పంచుకోవాలే తప్ప, నష్టాల్లో ఉన్నప్పుడు కూడా భారీ అద్దెలు చెల్లించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే పర్సంటేజీ విధానం అమలులో ఉందని, కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే అద్దె పద్ధతి కొనసాగుతోందని నిర్మాత శిరీష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కేవలం పర్సంటేజీ విధానమే కాదు.. ప్రేక్షకులకు ఊరటనిచ్చే మరో నిర్ణయాన్ని కూడా ఎగ్జిబిటర్లు ప్రకటించారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా సరే, తాము మాత్రం థియేటర్లలో టికెట్ ధరలను పెంచకూడదని తీర్మానించారు. పెరిగిన ధరల వల్ల సామాన్య ప్రేక్షకుడు థియేటర్లకు దూరం కాకుండా ఉండాలనే ఈ భరోసా ఇస్తున్నట్లు వారు తెలిపారు.
"థియేటర్లు బంద్ చేస్తున్నామనేది అబద్ధం.. కానీ పర్సంటేజీ విధానానికి ఒప్పుకున్న సినిమాలను మాత్రమే ప్రదర్శిస్తాం" అని ఎగ్జిబిటర్ల అసోసియేషన్ స్పష్టం చేసింది. మరి ఎగ్జిబిటర్ల ఈ డిమాండ్‌పై టాలీవుడ్ నిర్మాతలు, హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి.

