Cm Revanthreddy Film Industry : అందరూ చట్టం పరిధిలో పనిచేయాల్సిందే
తెలుగు సినీ నిర్మాతలు, దర్శకులకు స్పష్టం చేసిన సీయం రేవంత్‌రెడ్డి

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వ్యవస్ధలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదని, అందరూ చట్ట పరిధిలో పనిచేయాల్సిందే అని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి టీజీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాతలు, దర్శకులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పరిశ్రమలో నిర్మాతలు, కార్మికుల అంశంలో సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవమరించాలని హితవు పలికారు. నిర్మాతలు,కార్మికులు,ప్రభుత్వం కలిసి ఒక పాలసీ తీసుకువస్తే బాగుంటుందన్నారు. సినీ పరిశ్రమకు మానిటరింగ్ అవసరమని పరిశ్రమకు ఏం కావాలో ఒక కొత్త పుస్తకం రాసుకుందామన్నారు. సినీ కార్మికులు, నిర్మాతలను కూడా ప్రభుత్వం కాపాడుకుంటుందని ఈ సందర్భంగా సీయం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. సిని పరిశ్రమ విషయంలో తాను న్యూట్రల్‌గా ఉంటానని సీయం తెలిపారు.
ప్రభుత్వం తరపు నుంచి సినీ పరిశ్రమకు పూర్తి సహాకారం ఉంటుదని సీయం రేవంత్‌రెడ్డి చెప్పారు. పరిశ్రమలోకి కొత్తగా వచ్చే వారికి నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని సీయం సూచించారు. సినీ పరిశ్రమకు చెందిన వివిధ క్రాఫ్ట్‌ల్లో నైపుణ్యం పెంచడానికి ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. స్కీల్ యూనివర్శిటీలో సినిమా పరిశ్రమ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని సీయం ప్రకటించారు. తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు అంతర్జాతీయ స్ధాయికి వెళ్ళిందని సీయం అన్నారు. తెలంగాణకు సంబంధించి ముఖ్యమైన పరిశ్రమ చలనచిత్ర పరిశ్రమే అని అందువల్లే పరిశ్రమలో వివాదం వద్దనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సినీ కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపించిందని సీయం పేర్కొన్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ సినిమాల చిత్రీకరణ కూడా జరుగుతుండటం మంచి పరిణామం అన్నారు. తెలుగు సినిమాల చిత్రీకరణ కూడా ఎక్కువగా మన రాష్ట్రంలోనే జరిగేలా చూడమని నిర్మాతలు, దర్శకులకు సీయం సలహా ఇచ్చారు. అంతర్జాతీయ స్ధాయిలో తెలుగు సినిమా పరిశ్రమను ఉంచడమే తన ధ్యేయమని, సినిమా పరిశ్రమలో పని వాతావరణం బాగుండాలని సీయం ఆకాక్షించారు. తెలుగు సినీ కార్మికులను కూడా పలిచి మాట్లాడతా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు డీవీవీదానయ్య, వంశీ, గోపి, చెరుకూరి సుధాకర్, సాహు, అభిషేక్ అగర్వాల్, విశ్వ ప్రసాద్, అనిల్ సుంకర, శరత్ మరార్, ఎన్వీ ప్రసాద్, ఎస్కేఎన్, రాధామోహన్, దాములు ఉన్నారు వీరితో పాటు ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్, కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల తదితరులు ఉన్నారు.
