Samantha: ఓటములే నాకు గురువులు: బిజినెస్‌లో ఎదురైన వైఫల్యాలపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

Samantha: సినీ రంగంలో అగ్ర కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంత, పారిశ్రామికవేత్తగానూ దూసుకుపోతున్నారు. అయితే బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో తాను కూడా తీవ్రమైన ఎదురుదెబ్బలు తిన్నానని ఆమె తాజాగా వెల్లడించారు. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న ఆమె, తన వ్యాపార ప్రయాణంలో ఎదురైన వైఫల్యాలు, వాటి నుంచి నేర్చుకున్న జీవిత పాఠాల గురించి ఎంతో స్పష్టంగా పంచుకున్నారు.
తొలి అడుగులోనే పరాజయం.. కానీ అదే పెద్ద పాఠం
వ్యాపార రంగంలో తన ప్రారంభ అనుభవాలను గుర్తుచేసుకుంటూ సమంత మాట్లాడారు. ‘‘నేను మొదటగా భాగస్వామ్యంతో పెట్టిన వ్యాపారం ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. నిజం చెప్పాలంటే.. నా తొలి పెట్టుబడే విఫలం కావడం నా దృష్టిలో చాలా మంచిదైంది. ఎందుకంటే, విజయాలు మనకు పెద్దగా ఏమీ నేర్పించవు. కానీ ఎదురయ్యే అపజయాలు, వైఫల్యాలే జీవితంలో అత్యంత విలువైన పాఠాలను నేర్పిస్తాయి. నా జీవితంలో నేను ఈరోజు ఇంత బలంగా ఉండటానికి కారణం ఆ ఓటముల ద్వారా నేర్చుకున్న విషయాలే’’ అని సమంత పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు తోడ్పాటు.. 8 స్టార్టప్‌లలో పెట్టుబడులు
వ్యాపార రంగంలో మహిళలు ఎదుర్కొనే భయాలు, సవాళ్లపై కూడా సమంత తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సాధారణంగా సమాజంలో ఏదైనా కొత్త వ్యాపారాన్ని లేదా ప్రయోగాన్ని ప్రారంభించే సమయంలో పురుషుల కంటే మహిళలకే ఎక్కువగా అభద్రతాభావం, భయాలు ఎదురవుతాయని చెప్పారు. అలాంటి మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం తనకు ఎంతో సంతృప్తిని ఇస్తుందన్నారు. ‘‘ఇప్పటివరకు నేను దాదాపు 8 నుంచి 10 వరకు వివిధ వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టాను. అందులో విశేషమేమిటంటే.. ఏకంగా ఎనిమిది సంస్థలకు మహిళలే వ్యవస్థాపకులుగా ఉండటం గర్వకారణం. మహిళా వ్యాపారవేత్తలతో కలిసి పనిచేయడం నాకు గొప్ప అనుభూతిని ఇస్తోంది’’ అని ఆమె వివరించారు.

