Tollywood : ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌తో సినీ నిర్మాతల భేటీ
ఫిల్మ్ ఫెడరేషన్ సమ్మెతో మంత్రి దుర్గేష్, నిర్మాతల భేటీకి ప్రాధాన్యం

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజ నిర్మాతలు సోమవారం ఏపీ సినిమాటోగ్రఠఫీ మంత్రి కందుల దుర్గేష్‌తో వెలగపూడిలో ఉన్న సచివాలయంలో భేటీ అయ్యారు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సమ్మెకారణంగా హైదరాబాద్‌లో సినిమా షూటింగులు నిలిచిపోయిన నేపథ్యంలో పలువురు తెలుగు సినీ నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్‌తో సమావేశం అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో సినీ రంగ సమస్యలు, సినీ కార్మికుల ఆందోళనలపై మంత్రి దుర్గేష్‌కు సినీ నిర్మాతలు వినతిపత్రం అందజేశారు. అనంతరం కందుల దుర్గేష్ మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం జరుగుతున్న పరిణమాలు తెలియజేయడానికి నిర్మాతలు వచ్చి కలుస్తామన్నారని, రమ్మని ఆహ్వానించామని అంతకు మించి ప్రత్యేక ఎజెండా ఏదీ లేదని అన్నారు. ఈ ఆందోళనలకు సంబంధించి నిర్మాతలు, సినీ కార్మికులు ఇరువురు చెప్పే విషయాలు వింటామని మంత్రి చెప్పారు. ఇరువురి అభిప్రాయాల విని సీయం, డిప్యూటీ సీయంల దృష్టికి అంశాన్ని తీసుకువెళ్లి చర్చిస్తామని దుర్గేష్ తెలిపారు. ఫెడరేషన్, నిర్మాతల మద్య వివాదంలో ప్రభుత్వ జోక్యం అవసరమైతే సీయం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీయం పవన్‌కళ్యాణ్‌ల స్ధాయిలో నిర్ణయాలు తీసుకుంటారని మంత్రి వెల్లడించారు. సమస్య పరిష్కారానికి ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, ఛాంబర్ కలసి కూర్చుని మాట్లాడుకోవాలని మంత్రి దుర్గేష్ సూచించారు. ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మౌలిక సదుపాయల ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఏపీలో ఎవరైనా స్టూడియోలు, రీ రికార్డింగ్ ధియేటర్లు, డబ్బింగ్ ధియేటర్లు నిర్మించడానికి ముందుకు వస్తే ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఏపీ మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు.
