Preethi Munde: ఏజెన్సీ గడప దాటి జాతీయ వేదికపై మెరిసిన గిరిజన బిడ్డ..మిస్ ఇండియా ఎర్త్ వాటర్ 2026గా ఆదిలాబాద్ యువతి ప్రీతి ముండే..
ప్రీతి ముండే..

Preethi Munde: మారుమూల గిరిజన గ్రామం నుంచి బయలుదేరిన ఒక సాధారణ యువతి, అకుంఠిత దీక్షతో జాతీయ స్థాయి అందాల పోటీల్లో సత్తా చాటి తెలంగాణ ఖ్యాతిని నలుదిశలా చాటింది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఈ నెల 19న డివైన్ బ్యూటీ గ్రూప్ నిర్వహించిన మిస్ డివైన్ బ్యూటీ 2026 గ్రాండ్ ఫినాలేలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రీతి ముండే మిస్ ఇండియా ఎర్త్ వాటర్ 2026 కిరీటాన్ని కైవసం చేసుకుంది. అందం, వ్యక్తిత్వంతో న్యాయనిర్ణేతలను మెప్పించిన ఆమె, పోటీల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మిస్ కంజీనియాలిటీ అవార్డును సైతం తన ఖాతాలో వేసుకుంది.
ఈ జాతీయ పోటీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించిన ప్రీతి, దేశవ్యాప్తంగా వచ్చిన పోటీదారులకు గట్టి పోటీనిచ్చింది. ఈ వేదికపై మహారాష్ట్రకు చెందిన ఆర్య ఆవధూత్ ప్రధాన టైటిల్ డివైన్ మిస్ ఎర్త్ ఇండియా 2026 గెలుచుకోగా, కీలకమైన ఎలిమెంటల్ విభాగాల్లో ప్రీతి ముండే వాటర్ టైటిల్‌ను దక్కించుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ అనే చిన్న ఏజెన్సీ గ్రామానికి చెందిన ముండే ప్రహ్లాద్, ఉమా దంపతుల కుమార్తె ప్రీతి. కట్టుబాట్లు, పరిమితులు ఉండే గ్రామీణ వాతావరణం నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న ఆమె, మోడలింగ్ రంగంలో అంచెలంచెలుగా ఎదిగింది. గతంలోనే ‘మిస్ హైదరాబాద్ రన్నరప్’, ‘మిస్ మహారాష్ట్ర (బ్రెయిన్ విత్ బ్యూటీ)’ వంటి పురస్కారాలతో తన ప్రతిభను చాటుకున్న ప్రీతికి మోడలింగ్‌తో పాటు జ్యోతిష్యం, టారోట్ రీడింగ్ వంటి రంగాల్లోనూ ప్రవేశం ఉంది.
అవకాశాలు అంతంతమాత్రంగా ఉండే ఏజెన్సీ ప్రాంతం నుంచి జాతీయ స్థాయి వేదికపై కిరీటాన్ని గెలుచుకోవడంతో ఆమె స్వగ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ నేపథ్యం నుంచైనా అత్యున్నత శిఖరాలను అధిరోహించవచ్చని ప్రీతి నిరూపించిందని స్థానికులు, కుటుంబ సభ్యులు గర్వంగా ప్రశంసిస్తున్నారు.

