వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (FWICE), నటుడు రణవీర్ సింగ్ (Ranveer Singh) ‘డాన్ 3 (Don3)’ సినిమా ప్రాజెక్ట్ నుంచి చివరి నిమిషంలో వైదొలిగిన అంశంపై ఇండియన్ ఫిల్మ్ & టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ (IFTDA) పంపించిన ఫిర్యాదును అత్యంత సీరియస్ గా పరిగణించింది. ఈ ఫిర్యాదును దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ 2026 ఏప్రిల్ 11న IFTDAకి సమర్పించగా, అనంతరం ఆ విషయాన్ని తదుపరి చర్యల కోసం FWICEకి అధికారికంగా పంపించారు. న్యాయం, పారదర్శకత, సహజ న్యాయ సూత్రాల ప్రకారం FWICE అన్ని పక్షాల వాదనలు వినేందుకు సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాల్లో దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్‌తో పాటు సినిమా నిర్మాతలు కూడా పాల్గొన్నారు.

విచారణ సందర్భంగా ఫర్హాన్ అఖ్తర్, రితేష్ సిద్ధ్వానీ మాట్లాడుతూ, ‘డాన్ 3’ చిత్ర ప్రీ-ప్రొడక్షన్ కోసం ఇప్పటికే సుమారు రూ.45 కోట్ల వ్యయం జరిగిందని తెలిపారు. ఇంత కీలక దశలో ప్రధాన నటుడు అకస్మాత్తుగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం వల్ల నిర్మాతలకు తీవ్ర ఆర్థిక నష్టం కలగడమే కాకుండా సినిమా నిర్మాణ ప్రక్రియపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, దర్శకుడిగా తాను ఈ భారీ ప్రాజెక్ట్ కోసం తన ప్రొఫెషనల్ షెడ్యూల్‌ను పూర్తిగా బ్లాక్ చేసుకున్నానని ఫర్హాన్ అఖ్తర్ పేర్కొన్నారు. ముఖ్యంగా స్టార్ హీరోతో సినిమా ప్రారంభమైన తర్వాత ఇలాంటి ఆకస్మిక వైదొలగడం పరిశ్రమ నైతిక విలువలకు, వృత్తిపరమైన ప్రమాణాలకు వ్యతిరేకమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫిర్యాదు దారుల వాదనలు విన్న అనంతరం FWICE, రణవీర్ సింగ్‌ను వ్యక్తిగతంగా హాజరై తన వివరణ ఇవ్వాలని పలుమార్లు నోటీసులు జారీ చేసింది. ఇందుకోసం 2026 ఏప్రిల్ 22న తొలి రిమైండర్, ఏప్రిల్ 30న రెండో రిమైండర్, మే 13న మూడో రిమైండర్ పంపింది. అయితే అనంతరం రణవీర్ సింగ్ (Ranveer Singh) తరఫున FWICEకి సమాధానం అందింది. అందులో ఈ వివాదం ఒప్పంద పరమైనదని, దీనిపై తీర్పు ఇవ్వాల్సింది సరైన న్యాయ వేదికేనని, FWICE సరైన వేదిక కాదని పేర్కొన్నారు. ఈ సమాధానాన్ని FWICE తీవ్రంగా పరిగణించింది. ప్రాజెక్ట్‌కు సంబంధించిన భాగస్వాములు, ఫెడరేషన్ పట్ల ప్రదర్శించిన వైఖరిని దృష్టిలో ఉంచుకుని, FWICE కార్యవర్గం రణవీర్ సింగ్‌పై నాన్-కోఆపరేషన్ డైరెక్టివ్ (NCD) జారీ చేయాలని నిర్ణయించింది.

ఈ అంశంపై చర్చించి, పరస్పర అంగీకారంతో పరిష్కారం కనుగొనేందుకు రణవీర్ సింగ్‌తో సమావేశం కావడానికి FWICE సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. సినీ పరిశ్రమ ఒక పెద్ద కుటుంబంలా పనిచేస్తుందని, ఇందులో నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, కార్మికులు అందరూ పరస్పర విశ్వాసం, గౌరవం, వృత్తిపరమైన బాధ్యతలతో కలిసి పనిచేస్తారని FWICE పేర్కొంది. ముఖ్యంగా ప్రముఖ నటులు కీలక దశలో సినిమాల నుంచి తప్పుకోవడం వినోద పరిశ్రమ ఉనికికి, పని వాతావరణానికి తీవ్రమైన ముప్పుగా మారుతుందని ఫెడరేషన్ అభిప్రాయపడింది.

ఈ నేపథ్యంలో ఇలాంటి వృత్తిపరమైన నియమాలకు విరుద్ధమైన చర్యలను నిరుత్సాహపరచేందుకు, భారతీయ సినిమా, టెలివిజన్ పరిశ్రమ ప్రయోజనాల దృష్ట్యా అందరు నిర్మాతలు, అన్ని నిర్మాతల సంఘాలు, పరిశ్రమ సంస్థలు FWICEకు మద్దతుగా నిలవాలని ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది.

Lipika Varma

Lipika Varma

Next Story