ముంబైలోని ప్రఖ్యాత గేట్‌వే ఆఫ్ ఇండియా వేదికగా దివ్యజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'గ్లోబల్ పీస్ ఆనర్స్ 2026' వేడుక అత్యంత భావోద్వేగభరితంగా, స్ఫూర్తిదాయకంగా జరిగింది. 26/11 ముంబై ఉగ్రదాడులకు 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమరవీరులకు, బాధితులకు నివాళులర్పిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త బి. ప్రభాకరన్ తన అరుదైన అంకితభావంతో అందరి మనసులు గెలుచుకున్నారు.

గడ్చిరోలి ప్రజలకు అవార్డు అంకితం చేసిన బి. ప్రభాకరన్

పారిశ్రామిక వృద్ధి, ఉపాధి కల్పన, సామాజిక అభివృద్ధి ద్వారా మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంత రూపురేఖలను మార్చినందుకు గాను 'లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్' మేనేజింగ్ డైరెక్టర్ 'బి. ప్రభాకరన్'‌కు ప్రతిష్టాత్మక 'గ్లోబల్ పీస్ ఆనర్స్ 2026' పురస్కారం లభించింది. అవార్డు అందుకున్న అనంతరం ఆయన చేసిన ప్రసంగం సభికులను కదిలించింది.

ఈ గౌరవాన్ని గడ్చిరోలి ప్రజలకే అంకితం చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభాకరన్.. "స్థానిక ప్రజల నమ్మకం, భాగస్వామ్యం వల్లే ఈ ప్రగతి సాధ్యమైంది. మాపై విశ్వాసం ఉంచిన గడ్చిరోలి ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ గుర్తింపు వారికే చెందుతుంది. వారి నమ్మకమే నాకు అతిపెద్ద ప్రేరణ, వారి అభివృద్ధి నా ప్రథమ బాధ్యత" అని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో లాయిడ్స్ మెటల్స్ సంస్థ దాదాపు 14,500 మంది పురుషులు, 3,000 మంది మహిళలతో కలిపి మొత్తం 17,500 మందికి పైగా ఉపాధి కల్పించింది. అలాగే 'వన్య గార్మెంట్ సెంటర్' ద్వారా స్థానిక మహిళలకు నైపుణ్య శిక్షణ, జీవనోపాధి కల్పిస్తూ ఆ ప్రాంతంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధికి తోడ్పడుతున్నారు.

శాంతి సందేశంతో ఆకట్టుకున్న షారుఖ్ ఖాన్

మరోవైపు, ఈ వేడుకలో పాల్గొన్న బాలీవుడ్ సూపర్ స్టార్ 'షారుఖ్ ఖాన్' తన ప్రసంగంతో అందరిలో స్ఫూర్తి నింపారు. 26/11 ముంబై దాడులతో పాటు పహల్గామ్ ఉగ్రదాడి, ఇటీవలి ఢిల్లీ పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు, దేశ రక్షణలో అమరులైన భద్రతా సిబ్బందికి ఆయన ఘన నివాళులర్పించారు.

ద్వేషాన్ని ప్రేమగా ఎలా మార్చాలని తన చిన్న కుమారుడు అబ్రామ్ అడిగిన ప్రశ్నను గుర్తుచేసుకున్న షారుఖ్.. "హింసకు బదులు సంభాషణను, భయానికి బదులు నమ్మకాన్ని ఎంచుకుని సామరస్యంగా జీవిస్తే ప్రేమ ఎప్పటికీ గెలుస్తుంది. శాంతి అనేది మన హృదయాల్లోంచే మొదలవ్వాలి. సామాన్యుడి శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. కుల, మత భేదాలను పక్కనపెట్టి మానవత్వం వైపు అడుగులు వేసినప్పుడే మన వీరుల త్యాగాలకు సార్థకత చేకూరుతుంది" అని పిలుపునిచ్చారు. అలాగే 26/11 దాడుల ప్రాణాలతో బయటపడిన దేవికా రొటావాన్‌తో షారుఖ్ ఆప్యాయంగా ముచ్చటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Next Story