Dil Raju Makes Key Comments: రెండు రోజుల్లోనే గుడ్ న్యూస్.. పర్సంటేజీ విధానంపై దిల్ రాజు కీలక వ్యాఖ్యలు
పర్సంటేజీ విధానంపై దిల్ రాజు కీలక వ్యాఖ్యలు

Dil Raju Makes Key Comments: పర్సంటేజీ విధానం అనేది కేవలం ‘పెద్ది’కి (పెద్ద సినిమాలకు) సంబంధించింది మాత్రమే కాదని, ఇది ఇండస్ట్రీ మొత్తానికి సంబంధించిన సమస్య అని తెలంగాణ ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు స్పష్టం చేశారు. వారం క్రితం ఛాంబర్ ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను చిరంజీవి పరిశీలిస్తానని చెప్పారని.. రెండు రోజుల్లోనే ఈ సమస్యకు శుభం కార్డు పడుతుందని దిల్‌రాజు ఆశాభావం వ్యక్తం చేశారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో థియేటర్ల ప్రదర్శన, పర్సంటేజీ విధానంపై నెలకొన్న వివాదంపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు, ఎగ్జిబిటర్లు దిల్‌రాజు, సురేశ్‌బాబు, అల్లు అరవింద్, కేఎల్ నారాయణ మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ ఛాంబర్ ఎగ్జిబిటర్లు, కలిశారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను చిరంజీవి దృష్టికి తీసుకెళ్లారు. సినిమాలు ప్రదర్శించే విషయంలో ఎగ్జిబిటర్లు, థియేటర్ల యజమానులు కోరుతున్న పర్సంటేజీ విధానంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ నడిచింది. దీనిపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి.. ఇటు నిర్మాతలు, అటు ఎగ్జిబిటర్లు ఇద్దరికీ న్యాయం జరిగేలా ఒక స్పష్టమైన నిర్ణయానికి రావాలని సూచించారు. రాబోయే పెద్ద చిత్రాల విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని కోరారు.
మరోవైపు సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను విని చిరంజీవి ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలంగాణ ఎగ్జిబిటర్ల కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. త్వరలోనే ఎగ్జిబిటర్లతో కలిసి కూర్చొని కమిటీ తుది నిర్ణయాన్ని ఛాంబర్ అధికారికంగా ప్రకటిస్తుందని వెల్లడించారు. ఈ చర్చలతో టాలీవుడ్ థియేటర్ల వివాదానికి త్వరలోనే శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

